
పాత పెన్షన్ సాధనకు మరో ఉద్యమం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పాత పెన్షన్ సాధన కోసం ఉద్యోగులు మరో ఉద్యమం చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలుతోపాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు టీఎన్‌జీఓ, టీజీఓ, సీపీఎస్‌తోపాటు వివిధ ఉద్యోగ సంఘాలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టిందని, దానికి అనుగుణంగా వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉద్యోగులను గత ప్రభుత్వం మోసం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులను మోసం చేయాలని చూస్తే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్, టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలని అప్పటి దాకా ఉద్యోగుల పోరాటాన్ని ఆపేది లేదన్నారు. సీపీఎస్ అంతం.. ఉద్యోగుల పంతం అనే నినాదంతో పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ కార్యదర్శి చంద్రనాయక్, టీజీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి చంద్రకాంత్, టీఎన్‌జీఓ కోశాధికారి కృష్ణమోహన్, డీటీ దేవేందర్, యూటీఎఫ్ జిలా కార్యదర్శి వెంకటేశ్, నందకిషోర్, రాజేష్, శ్యాంసుందర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, యుగేందర్‌నాయుడు, కృష్ణకాంత్, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణకుమార్‌గౌడ్, మధుసూదన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.