మహబూబ్‌నగర్ రూరల్: స్థానిక సమస్యలపై సీపీఎం బస్తీబాట పట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు తెలిపారు. బుధవారం మాచన్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలకు ప్రజలను సిద్ధం చేస్తామన్నారు. కార్పొరేట్ శక్తులను కాపాడుకునేందుకు కేంద్ర బడ్జెట్ వారికే అనుకూలంగా ప్రవేశపెట్టి పేదలకు మాత్రం మొండి చెయ్యి చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అసంపూర్తిగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు రైతులందరికీ రుణమాఫీ కాలేదని, అన్ని రకాల పెన్షన్స్ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కూడా అసంపూర్తిగానే వేశారని తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు గ్రామాల్లో ప్రజాసమస్యలు, స్థానిక సమస్యలు అధ్యయనం చేసి గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు కడియాల మోహన్, హన్మంతు, భగవంతు, లింగంగౌడ్ పాల్గొన్నారు.