
ఉత్సాహంగా పెద్ద కిస్తీలు
అలంపూర్: పట్టణంలో హజరత్ షాఅలీ పహిల్వాన్ ఉర్సులో భాగంగా గురువారం పెద్ద కిస్తీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. షాఅలీ పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గా వద్ద జరిగిన కిస్తీ పోటీల్లో వందలాది భక్తుల మధ్య తబురుక్ (ప్రసాదం) కోసం పహిల్వాన్‌లు తలపడ్డారు. కిస్తీలో వేసిన ప్రసాదాన్ని భక్తులపైకి విసురుతూ ఉర్సు ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్బంగా అబ్బుర పరిచే విన్యాసాలతో భక్తులను అలరించారు. ముందుగా కిస్తీ పోటీలను దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్ సయ్యద్ అహ్మద్ షా ఓవైసీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయుడు దర్గాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కిస్తీ పోటీల వద్దకు చేరుకొని తిలకించారు. నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేతో పాటు తహసీల్దార్ మంజుల, ఎస్‌ఐ వెంకటస్వామిని శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం సయ్యద్ ఖాదర్ బాషా ఇంటి నుంచి వచ్చిన సర్కారీ కిస్తీని ఊరేగింపుగా దర్గాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నిర్వాహక కమిటీ సభ్యులు సర్కారీ కిస్తీని సిద్ధం చేశారు. మత పెద్దల ప్రత్యేక ప్రార్ధనల అనంతరం ఎమ్మెల్యే కిస్తీ పోటీలను ప్రారంభించారు. పెద్ద కిస్తీల సందర్భంగా సీఐ రవిబాబు, ఎస్‌ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో 70 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.
ఊరేగింపుగా కిస్తీలకు ప్రసాదం..
షా అలీ పహిల్వాన్ దర్గాలో పెద్ద కిస్తీ పోటీల కోసం తెచ్చే ప్రసాదాన్ని భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అలంపూర్ మున్సిపాలిటీలోని ఆయా కాలనీలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి కిస్తీ పోటీలకు ప్రసాదం అందించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉర్సుకు తరలివచ్చిన భక్తజనంతో ప్రధాన వీధులు సందడిగా మారాయి.
ప్రసాదం కోసం పహిల్వాన్‌ల విన్యాసాలు