
ఎస్‌వీఎస్‌లో రోబోటిక్ సర్జరీ సేవలు
పాలమూరు: జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సేవల్లో ఒకటైన రోబోటిక్ జాయింట్ నీ–రీప్లేస్‌మెంట్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్‌వీఎస్ ఎండీ డాక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు. గురువారం ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై రాబోయే రోజుల్లో అనుభవంతో కూడిన రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఈ చికిత్స ఎంతో అవసరమన్నారు. ఎస్‌వీఎస్‌లో ఇప్పటి వరకు 500 నీ–రీప్లేస్‌మెంట్ సర్జరీలు చేశామని.. ఇప్పుడు మొదటిసారి రోబోటిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. ఇకపై అధిక ఖర్చులు చేసి హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా స్థానికంగానే ఇలాంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రోబోటిక్ సర్జరీల్లో ఇన్ఫెక్షన్ శాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఎస్‌వీఎస్‌లో ఇలాంటి అధునాతన వైద్యంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇలాంటి సర్జరీలు చేయడానికి యువ వైద్యులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సర్జరీలు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. అన్ని రకాల ఇన్సూరెన్స్ గ్రూప్స్, ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నీ–జాయింట్ రీప్లేస్‌మెంట్ చికిత్సలో సర్జరీతో పాటు ఆ తర్వాత తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన ఉండటం చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో వైద్యులు వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి తదితరులు ఉన్నారు.