
పోలీస్‌స్టేషన్ వద్ద భూ నిర్వాసితుల ఆందోళన
బల్మూర్: మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ నిర్వాసితుడు గంట కృష్ణయ్యను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అతడి అక్రమ అరెస్టును నిరసిస్తూ భూ నిర్వాసితులు పెద్దఎత్తున స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ సేకరణ కోసం ఈ నెల 24న గ్రామసభ నిర్వహించనున్నారు. అయితే భూ సేకరణకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి గంట కృష్ణయ్య తోటి నిర్వాసిత రైతుల ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాల జిరాక్స్ సేకరిస్తుండగా.. పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహానికి గురైన భూ నిర్వాసితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నిర్వాసిత రైతును అక్రమంగా నిర్బంధించడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. తమ హక్కులను కాపాడుకోవాలనే ప్రయత్నాన్ని పోలీసులతో అడ్డు కోవాలని ప్రభు త్వం కుట్ర పన్నుతుందని వారు మండిపడ్డారు. భూ నిర్వాసితులందరికీ న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. కాగా, ఈ విషయమై ఎస్‌ఐ రమాదేవిని వివరణ కోరగా. ఈ నెల 24న జరిగే భూ సేకరణ గ్రామసభలో తోటి రైతులతో కలిసి ఘర్షణకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు అతడిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని బేషరతుగా వదిలిపెట్టడం జరిగిందని తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో భూ పోరాట సమితి నాయకులు రఘుమారెడ్డి, నాగయ్య, సీతారాంరెడ్డి, శివశంకర్, తిరుపతయ్య, ఇంద్రారెడ్డి, ఆయా గ్రామాల భూ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.