
భాస్కర్ కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
గద్వాల క్రైం: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు భాస్కర్ (41), అతడి భార్య పవిత్ర (38), కుమారుడు అభిరాం (7), కుమార్తె జ్యోత్స్న (9) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విదితమే. గురువారం వారి మృతదేహాలను కర్ణాటక నుంచి స్థానిక బీసీ కాలనీలోని తమ నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకురావడంతో బంధువులు, కాలనీ వాసుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించే వారే లేకపోయ్యారు. ప్రమాదంలోంచి బయటపడిన భాస్కర్ చిన్నకుమారుడు ప్రవీణ్‌తేజ్ అమ్మానాన్న, అక్క, అన్నయ్య ఎక్కడ ఉన్నారంటూ కంటతడి పెట్టాడు. జరిగిన ప్రమాదంపై ప్రవీణ్‌తేజ్ తేరుకునే పరిస్థితి లేకపోయింది. మృతుల చివరి చూపుకోసం బంధువులు, స్నేహితులు, కాలనీ వాసులు పెద్దఎత్తున చేరుకున్నారు. అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించారు.
● భాస్కర్ కుటుంబ సభ్యుల పార్థివదేహాలకు వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకులు పూలమా లలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని.. అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరి త, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, మోహన్‌రెడ్డి, హన్మంతు, ఆంజనేయులు, వెంకటస్వామి, నర్సింహ తదితరులు ఉన్నారు.