నిజాం తొత్తు జాగీర్దార్ సైతం గార్లలో అజమాయిషీ చలాయిస్తూ దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడేవాడు. నాడు రజాకార్లకు హెడ్‌గా మిస్కిల్ సాబ్ వ్యవహరించేవాడు. గార్ల శివారు జీవంజిపల్లిలో రజాకార్లకు మిస్కిల్ సాబ్ రైఫిల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. రజాకార్లు పగలు గ్రామాల్లో ప్రదర్శన నిర్వహిస్తూ జిన్నికా హుకుం సే నెహ్రూకు జూకా దేంగే అంటూ నినాదాలు చేసేవారు. రజాకార్లు, నైజాం పోలీసులు రాంపురంలో బాలింతను చెరచడంతో పాటు దుబ్బగూడెం, ముల్కనూరు గ్రామాల్లో ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ దాడులు నన్ను ఉద్యమం వైపు నడిపించాయి. నాడు ఈ ప్రాంత ఉద్యమ కమాండర్‌గా పనిచేస్తున్న తుమ్మల శేషయ్య నాయకత్వంలో ముందుకు సాగాం. బండ్లగూడ వద్ద సేద తీరుతున్న మా దళానికి రజాకార్లకు మధ్య 1948 సంవత్సరంలో జరిగిన ఎదురుకాల్పుల్లో దామినేని వెంకటేశ్వరరావు, బుచ్చి మల్లు, మరికొందరు అమరులయ్యారు.
– తోడేటి కొమురయ్య, గార్ల


