ప్రతీ రూ.2వేల పైబడి వ్యాపార చెల్లింపులపై 0.4శాతం ఎండీఆర్
సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు జీఎస్టీ, కొనుగోలు పన్ను, ఇతర చార్జ్‌లతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్టోబర్ 15 నుంచి అమలు కానున్న యూపీఐ లావాదేవీలపై పన్ను విధింపు బాంబు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై పడుతుంది. అయితే పెద్ద మొత్తంలోనే కొనుగోళ్లపై ఈ భారం పడుతుందని ప్రకటించినా.. పరోక్షంగా మాత్రం అన్ని కొనుగోళ్లపై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పడే ఆర్థిక భారం సరైందికాదని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలు, వినియోగదారుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో రోజుకూ రూ.100కోట్ల వ్యాపారం..
జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు రూ.100కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇందులో ప్రధానంగా మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, గూడూరు, బయ్యారం, గార్ల వంటి పెద్ద సెంటర్లతో పాటు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా వస్తువుల నుంచి గృహోపకరణాలు, మోటారు వెహికిల్స్, పంట ఉత్పత్తులు, దుస్తులు, మద్యం ఇలా అనేక రకాల లావాదేవీలు నడుస్తున్నాయి. అయితే ఇందులో రూ.10కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యక్షంగా జిల్లాపై రోజుకు రూ.4లక్షలకు పైగా భారం
పరోక్షంగా ప్రతీ కొనుగోలుకు యూపీఐ చార్జీలు
ప్రజలపై భారం పడుతుందంటున్న ఆర్థిక నిపుణులు
యూపీఐ వడ్డనపై అంచనాలు..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహబూబాబాద్ జిల్లాలో ఏ మేరకు ప్రభావం పడుతుందనేది చర్చగా మారింది. అయితే రైల్వే, టెలికం, గ్యాస్, పెట్రోలు వంటి వాటిపై వడ్డను ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా చిరు వ్యాపారులపై ప్రభావం ఉండదని అంటున్నారు. అయితే జిల్లాపై రోజుకూ రూ.4లక్షలకు పైగా భారం పడే అవకాశం ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు. పేరుకే చిరు వ్యాపారులు, ఇతర చిన్నచిన్న వ్యాపార సంస్థలపై ప్రభావం పడదని అంటున్నారని, అయితే పెద్ద వ్యాపారులపై పడిన భారాన్ని చిన్న వారిపై వేసే అవకాశం ఉంది.


