మహబూబాబాద్‌లో జెండావిష్కరించనున్న ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని ఆరు జిల్లా కేంద్రాల్లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉదయం 10గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్ త్రివర్ణ పతాకం ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధశాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్
నెహ్రూసెంటర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణా ళికతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్ అన్నారు. విద్యుత్ పంపిణీలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్‌లు, రెండు అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 61 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. 37.25 కిలో మీటర్ల 33కేవీ విద్యుత్ లైన్లు, 68.58కిలోమీటర్ల 11కేవీలైన్లు, ఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 600 కేవీఆర్ సామర్థ్యం గల రెండు కెపాసిటర్ బ్యాంకులు, ఒక బూస్టర్ ప్రారంభించామన్నారు. విద్యుత్ లైన్లను విస్తృతంగా తనిఖీ చేయడం, లూజులైన్లు గుర్తించడం, సరిచేయడం, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చర్యలను ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అత్యవసర వేళల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా.. స్పందించేలా డివిజన్‌లో అత్యవసర స్పందన బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
నేడు జిల్లాస్థాయి సైన్స్ సెమినార్
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో నేడు (గురువారం) సైన్స్‌సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు బుధవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. ఈ సైన్స్ సెమినార్‌కు 8, 9, 10వ తరగతుల విద్యార్థులు హాజరుకావాలని కోరారు.
ఎరువుల అమ్మకాలపై సమీక్ష
మహబూబాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలపై మానుకోట రైతు వేదిక కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర డివిజన్ పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లకు ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ విధివిధానాలపై వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, టెక్నికల్ ఏఓ జావీద్, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, జిల్లా ఫర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేమిశెట్టి సోమయ్య, మండల ఫర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వక్కల శ్రీనివాస్, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.


