● డోర్నకల్ మున్సిపాలిటీలో
డంపింగ్ యార్డు కరువు
● రోడ్డు పక్కన చెత్తతో దుర్గంధం
● స్థానికుల ఇబ్బందులు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా నేటికీ పట్టణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు బుద్దారం రోడ్డులో మున్నేరువాగుకు వెళ్లే దారి పక్కన డంపింగ్ యార్డు ఉండేది. అయితే నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండడం, దుర్గంధంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత అక్కడి డంపింగ్ యార్డు తొలగించి పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. దీంతో తాత్కాలికంగా డంపింగ్ యార్డును బంధం చెరువు సమపంలోని గొల్లచర్ల రోడ్డు పక్కకు తరలించారు.
ప్రతీ రోజూ 1.5 టన్నుల చెత్త సేకరణ..
డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డుల నుంచి ప్రతీరోజు 1.5టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన చెత్తను బంధం చెరువు కట్ట పక్కన పడేస్తున్నారు. సుమారు ఐదు సంవత్సరాలుగా చెత్త వేస్తుండటంతో ఈ ప్రాంతంలో చెత్త గుట్టలుగా పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. వర్షాలు పడిన సమయంలో తాత్కాలిక డంపింగ్ యార్డులోకి నీరు చేరి చెత్త కుళ్లి దుర్వాసన వస్తోంది. రోడ్డు పక్కనే డంపింగ్ యార్డు ఉండి నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగడం, బంధం చెరువు పక్కన వ్యవసాయ భూములకు నిత్యం రైతులు వెళ్తుండటంతో దుర్గంధంతో నరకయాతన అనుభవిస్తున్నారు.
స్థలం కొరత..
మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కోసం అన్వేషి స్తుండగా ప్రభుత్వ స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో అమ్మపాలెం సమీపంలో ప్ర భుత్వ స్థలం గుర్తించి డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రయత్నాలు జరిపినా పలు కారణాలతో యార్డు ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం బంధం చెరువు వద్ద డంపింగ్ యార్డులో రోజురోజుకూ చెత్త పెరుగుతుండడంతో అటు చెరువు, ఇటు రోడ్డుపైకి చెత్త విస్తరించి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు, మున్సిపాలిటీ పాలకవర్గం స్పందించి ప్రభుత్వ స్థలం గుర్తించి డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
స్థలం గుర్తింపునకు ప్రయత్నాలు..
డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం కోసం తహసీల్దార్‌తో చర్చలు జరుపుతున్నాం. స్థలం కొరతతో బంధం చెరువు పక్కన చెత్తను డంప్ చేస్తున్నాం. స్థలం కేటాయించిన వెంటనే డంపింగ్ యార్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
–బి.నాగరాజు, మున్సిపల్ కమిషనర్, డోర్నకల్


