గార్ల: మండలంలోని పాకాల ఏటి పరీవాహకంలో రైతులు జోరుగా వరినాట్లు వేస్తున్నారు. సుమారు వెయ్యి ఎకరాల్లో నాట్లు కొనసాగుతున్నాయి. వర్షాలు కురుస్తాయని, ఏరు పారుతుందనే ఆశతో రైతులు వరినాట్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల్లో నీళ్లు లేక భూములు బీళ్లు..
మండలంలోని చెరువులు, కుంటల్లో నీళ్లు లేక ఆయకట్టు పంట భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గార్ల పెద్దచెరువు, అప్పసముద్రం, గండిచెరువు, బోడాయికుంట, పుల్లూరు పెద్దచెరువు, పోచారం, మర్రిగూడెం, గోపాలపురం, పినిరెడ్డిగూడెం, సీతంపేట, బుద్దారం, రాంపురం, మద్దివంచ, ముల్కనూరు తదితర పంచాయతీల్లోని చెరువులు, కుంటల కింద సుమారు 6 వేల ఎకరాల భూముల్లో వరిపంట వేసేందుకు రైతులు వరినార్లు పోసుకొని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
ఆరుతడి పంటలు వేయాలని..
వ్యవసాయ అధికారులు తక్కువ నీటి వినియోగం ఉన్న ఆరుతడి పంటలు పెసర, కంది, మినుము, నువ్వులు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. అయితే రైతులు మాత్రం ఆరుతడి పంటలు సాగు చేసేందుకు విముఖత చూపడం లేదు.
పాకాల ఏటి పరీవాహకంలో
సాగు పనులు
చెరువులు, కుంటల కింద నాట్లు
ప్రశ్నార్థకమే!
ఆరుతడి పంటలపై రైతుల ఆనాసక్తి


