హన్మకొండ: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతోపాటు ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు విద్యుత్ ఉపకరణాల కోసం విద్యుత్‌ను విరివిగా వాడుతోండడంతో బిల్లులు షాకిస్తున్నాయి. వర్షాకాలంలోనూ వేసవి నాటి బిల్లులు వస్తుండడంతో విద్యుత్ వినియోగదారులు మొత్తుకుంటున్నారు. కాలచక్రం మారుతున్నా వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. వేడి వాతావరణం నెలకొని ఉండడంతో గృహాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర కార్యాలయాల్లోను ఏసీలు, కూలర్లు వేసవికి దీటుగా వినియోగిస్తున్నారు. దీంతో వేసవిలో మాదిరిగానే విద్యుత్ విద్యుత్ బిల్లులు వస్తున్నాయి.
సీజన్ మారినా తగ్గని విద్యుత్ వినియోగం!
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా.. ఇప్పటి వరకు భారీ వర్షం కురువకపోవడం, వాతావరణం చల్లబడకపోవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం తగ్గలేదు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎల్‌టీ కేటగిరిలో 19,05,034 వినియోగదారులు ఉండగా, ఇందులో 12,89,903 మంది గృహ వినియోగదారులు, వాణిజ్య వినియోగదారులు 1,62,936 మంది, పరిశ్రమలు 12,018, కుటీర పరిశ్రమలు 2,288, వీధి దీపాలు 21,437, సాధారణం 9,275, తాత్కాలిక వినియోగదారులు 2,714, ఈవీ చార్జింగ్ సర్వీస్‌లు 58 ఉన్నాయి. 2026 జనవరిలో టీజీ ఎన్పీడీసీఎల్ మొత్తం బిల్లింగ్ (డిమాండ్)రూ.921.08 కోట్లు కాగా జూన్‌లో రూ.1,156.63 కోట్లు, జూలైలో రూ.1,028,82 కోట్లు బిల్లింగ్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026 జనవరిలో రూ.177.41 కోట్లు కాగా జూన్‌లో రూ.253.68 కోట్లు, జూలైలో రూ.241.74 కోట్ల బిల్లింగ్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనవరితో చూసుకుంటే జూన్ నాటికి రూ.76.27 కోట్ల బిల్లింగ్ పెరిగింది. జనవరితో పోల్చుకుంటే జూలైలో రూ.64.33 కోట్లు పెరిగింది. జూన్‌తో చూసుకుంటే జూలైలో రూ.11.94 కోట్లు తగ్గినా జనవరితో చూసుకుంటే విద్యుత్ బిల్లులు పెరిగాయి.
ఎల్‌నినో ప్రభావంతో తగ్గని ఉష్ణోగ్రతలు
నేటికీ కూలర్లు, ఏసీలు,
ఫ్యాన్ల వినియోగం!
వానాకాలంలోనూ వేసవినాటి బిల్లులు
పెరిగిన విద్యుత్ వినియోగం
ఉమ్మడి వరంగల్ జిల్లా జనవరి బిల్లింగ్ రూ.177.41 కోట్లు
జూలైలో రూ.241.68 కోట్లు బిల్లింగ్


