పెండింగ్‌ పనులకు ఆమోదం తెలపండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులకు ఆమోదం తెలపండి

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

హన్మకొండ చౌరస్తా/ధర్మసాగర్‌: వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కీలక రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపడంతోపాటు జాతీయ రహదారిపై అసంపూర్తిగా ఉన్న సర్వీస్‌ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ వరంగల్‌ ఎంపీ కావ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని న్యూఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. హనుమకొండ జిల్లాలోని కరుణాపురం నుంచి పెద్ద పెండ్యాల, నర్సింగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్‌ మండల హెడ్‌క్వార్టర్‌, దేవునూర్‌, సోమదేవరపల్లి, దామెర, ఎల్కతుర్తి మండల హెడ్‌క్వార్టర్‌ వరకు ఉన్న రోడ్డును విస్తరించి బలోపేతం చేయాలని కోరారు. ప్రధానంగా ఈ రోడ్డు హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, సిద్దిపేటకు వెళ్లే వాహనాలు వరంగల్‌ వెళ్లే అవసరం లేకుండా 163, 563 జాతీయ రహదారులను అనుసంధానించే కీలక మార్గమని తెలిపారు. ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని అభివృద్ధి చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. అంతేకాకుండా యాదాద్రి–వరంగల్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–163) నాలుగు లైన్ల విస్తరణ సమయంలో పలు గ్రామాల్లో నిర్మించిన సర్వీస్‌ రోడ్ల మధ్య మిగిలిపోయిన లింకులను పూర్తి చేయాలని కోరారు. సర్వీస్‌ రోడ్లు ఉన్నప్పటికీ అనుసంధానం లేకపోవడంతో స్థానిక ప్రజలు ప్రధాన రహదారినే వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలతోపాటు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని వివరించారు. అవసరమైన భూమి ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో మిగిలిన లింకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) 2025–26 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని కోరారు. నర్సంపేట–నందిగామ రహదారి విస్తరణ, భట్టుపల్లి–హంటర్‌ రోడ్‌ మార్గ అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి త్వరగా ఆమోదం తెలపాలని కోరగా.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన

ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement