న్యూశాయంపేట: వక్ఫ్ భూముల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సాక్షి దినపత్రికలో శనివారం ‘వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువు.. అన్యాక్రాంతం అవుతున్న ఆస్తులు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. జిల్లాలో వక్ఫ్ భూముల పరిరక్షణ, ఆక్రమణలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం కలెక్టరేట్‌లో సమన్వయ కమిటీ, సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని వక్ఫ్ ఆస్తులు, పరిరక్షణ పెండింగ్‌లో ఉన్న అంశాలు, భూముల, రికార్డుల నిర్వహణ, ఆక్రమణల నివారణ శాఖల మధ్య సమన్వయంపై సమీక్షించారు. భూములకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) సంధ్యారాణి, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) వై.వి.గణేష్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి రమేష్, సర్వే అండ్ ల్యాండ్స్ అధికారి శ్రీనివాసులు, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో
కలెక్టర్ సత్యశారద


