మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. ప్రజావాణిలో 184 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్‌కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు
అందించాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుశాఖ లక్ష్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. హత్యలు, ఆస్తి నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసులు, చార్జిషీట్లు, కోర్టు వ్యవహారాల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్‌లో నమోదయ్యే ప్రతీ కేసు, ఫిర్యాదు, దర్యాప్తు వివరాలు, అరెస్టులు, చార్జిషీట్లు, వారెంట్లు, ఆస్తుల స్వాధీనం తదితర వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్ 2.0లో నమోదు చేయాలని, పెండింగ్ ఎంట్రీలు లేకుండా డేటా నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గంజాయి, డ్రగ్స్, గుడుంబా తయారీ, విక్రయాలు, రవాణాపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే నైట్ పెట్రోలింగ్, నైట్ బీట్స్, వాహన తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు, హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ దొంగతనాలు, చోరీలు, ఇతర నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని సమయస్ఫూర్తితో రక్షించిన మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఎస్సైలు రాజు, సతీష్, రవికిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలి
మహబూబాబాద్: సర్పంచ్‌లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలని , ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం సర్పంచ్‌ల చైతన్య సదస్సు నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నెలలో ఒక్కరోజు కలెక్టర్ సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఆరు నెలలకు ఒకసారి సీఎం సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలన్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లు పని చేయాలన్నారు. సమావేశంలో నాయకులు గునిగంటి కమలాకర్, భూక్య ప్రవీణ్, నరేందర్, వెంకట్, శ్రీనివాస్, గుట్టయ్య, యాకాంతం, బాబురావు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


