పంట కుంటలు రెండు రకాలు..
● ఫామ్ పాండ్స్‌తో రైతులకు ప్రయోజనం
● వీబీ జీ రామ్‌జీ పథకం ద్వారా సబ్సిడీ అందజేత
● రైతుల పంటలకు ఎంతో మేలు
డోర్నకల్: వర్షపు నీటిని నిల్వ చేసి వ్యవసాయ అవసరాలకు వాడుకునేలా పంట కుంటలు(ఫామ్ పాండ్స్) ఉపయోగపడుతాయి. మెట్టతో పాటు అన్ని రకాల భూముల్లో పంట కుంటలను ఏర్పాటు చేసుకుంటే వర్షాకాలంతో పాటు వేసవి కాలంలోనూ రైతులకు మేలు జరుగుతుంది. కాగా, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పంట కుంటలను తవ్వుకునేందుకు రైతులకు పూర్తి సబ్సిడీ అందిస్తోంది.
రెండు నుంచి ఐదెకరాల లోపు..
పంట కుంటల ఏర్పాటుతో రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రెండు నుంచి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు పంట కుంటలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులు. తమ వ్యవసాయ భూమిలో ఒంపుగా ఉన్న ప్రాంతంలో పంట కుంటను ఏర్పాటు చేసుకుంటే వరదనీరు పంట కుంటకు చేరుతుంది.
పంట కుంటలతో ప్రయోజనాలు..
● వర్షాభావ పరిస్థితుల్లో సైతం పంటల సాగుకు నీరు అందుబాటులో ఉంటుంది.
● వ్యవసాయం, పండ్ల తోటలు, కూరగాయల సాగుకు, ఇతర పంటలకు పంట కుంటల నీటిని వినియోగించవచ్చు.
● చేపల పెంపకంతో పాటు పంటలకు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో రైతులకు నీరు అందుబాటులో ఉంటుంది.
● సారవంతమైన భూమి పైపొర కొట్టుకుపోకుండా కాపాడుతుంది.
● భూగర్భ జలాల అభివృద్ధితో పరిసర ప్రాంతాల్లోని బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది.
● భూమి తేమ శాతం పెరుగుతుంది.
మొదటి రకం...
కొలతలు: 40 ఫీట్ల పొడవు, 40 ఫీట్ల వెడల్పు, 6.5 ఫీట్ల ఎత్తు
అంచనా వ్యయం: రూ.80,000.
పని దినాల సంఖ్య: 400
రెండో రకం కుంట..
కొలతలు: 65 ఫీట్ల పొడవు, 65 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల లోతు
అంచనా వ్యయం: రూ.4,00,000
పని దినాల సంఖ్య: 1100
అర్హత...
2 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు అర్హులు. పట్టాదారు పాసుపుస్తకం, వీబీజీ రామ్‌జీ జాబ్‌కార్డు, రైతు అంగీకార పత్రం అవసరం.


