ధర్మసాగర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, పొలాలకు సకాలంలో సాగునీరు అందించి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్. నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ (దక్షిణ కాల్వ) నుంచి సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు. సౌత్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత రాకుండా ఉండేందుకే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటి విడుదల ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు పెసరు రమేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. కాగా, రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడంపై రైతాంగం ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,
కె.ఆర్ నాగరాజు


