● వరంగల్ ఎంపీ కడియం కావ్య
కేయూ క్యాంపస్: ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ , భౌతిక, మౌలిక వసతుల కల్పనపై సోమవారం పార్లమెంట్‌లో ప్రస్తావించారు. సమగ్ర శిక్ష పథకం అమలు, డిజిటల్ విద్య, విస్తరణ, కేంద్ర నిధుల కేటాయింపులపై సమగ్ర వివరాలు కోరారు. ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయశాఖమంత్రి జయంతి చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. సమగ్ర శిక్ష పథకం కింద దేశవ్యాప్తంగా ఆ సీఎంఈ విద్యాదీక్ష, ఐసీటీ ల్యాబ్‌లు, స్మార్ట్‌క్లాస్‌రూమ్‌ల ద్వారా సాంకేతిక ఆధారిత విద్యాబోధనను ప్రోత్సహిస్తున్నట్లు తెలి పారు. రాష్ట్రాల వార్షిక కార్యాచరణ మేరకు కేంద్రం ఆర్థికసాయం అందిస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు?
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామంలో బాలికపై లైంగిక వేధింపులు జరిపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ఎస్సై సాయిబాబును వివరణ కోరగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టామన్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మొక్కజొన్న వ్యాపారి పరారీ
● రైతులకు రూ.12,39,360 ఎగవేత
మహబూబాబాద్ రూరల్ : మొక్కజొన్న పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఉడాయించిన వ్యాపారిపై బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి సోమవారం తెలిపారు. రైతులు అజ్మీరా నరేశ్, కోటేశ్, వెంకన్న, బానోత్ లక్ష్మణ్, మాలు, బోడ రాంజి, గుగులోత్ సూక్య, దూదిమెట్ల కట్టయ్య వద్ద వ్యవసాయ మార్కెట్ పరిధిలో వ్యాపారం నిర్వహించే ఎన్.ఎస్ ట్రేడర్స్ య జమాని ధరావత్ శేఖర్ రూ.12,39,360 విలువైన మొక్కజొన్న పంట కొనుగోలు చేశాడు. మే 8వ తేదీన పంటను కొనుగోలు చేసిన శేఖర్.. రైతులకు డబ్బులు ఇస్తానని చెప్పి వాయిదాలు పెట్టుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఘటనపై రైతుల ఫిర్యాదు మేరకు సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన విద్యార్థిని పాగె కృష్ణవేణి ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆశించిన మేరకు మార్కులు రాకపోవడంతో మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారని గ్రామస్తులు తెలిపారు.
రైల్లోనుంచి పడిన వ్యక్తి.. తెగిన చేయి
ఖిలా వరంగల్: ప్రమాదవశాత్తు రైలులోనుంచి జారిపడడంతో ఓ ప్రయాణికుడి ఎడమ చేయి తెగిపోయింది. ఈఘటన సోమవారం మధ్యాహ్నం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపం బట్టల బజార్ ఫ్లైఓవర్ వద్ద పట్టాలపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన మల్లికార్జున్ హైదరాబాద్ నుంచి సోమవారం రైలులో వరంగల్‌కు బయలుదేరాడు. పాత రైల్వే గేట్ వద్దకు రైలు చేరుకోగానే ప్రయాణికుడు మల్లికార్జున్ ప్రమాదవశాత్తు రైలులోనుంచి జారిపడ్డాడు. మల్లికార్జున్ ఎడమ చేయి తెగిపోవడంతోపాటు శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన ఈఎంటీ ఎండీ సలీమొద్దిన్, పైలెట్ అజీజ్‌పాషా ఘటన స్థలానికి చేరుకుని తాత్కాలిక చికిత్స అందజేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.


