బాలుడికి ఆర్‌ఎంపీ ఇంజెక్షన్‌.. | - | Sakshi
Sakshi News home page

బాలుడికి ఆర్‌ఎంపీ ఇంజెక్షన్‌..

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

కొద్ది సమయానికి మృతి

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి ఆర్‌ఎంపీ చికిత్స అందించిన అనంతరం ఆరోగ్యం విషమించి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌కు తాళం వేసి పరారైనట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన బలుగూరి సురేశ్‌, రేణుక దంపతులు మరిపెడలో వాటర్‌ ప్లాంట్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు నాని (3) జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం ఉదయం మరిపెడలోని ప్రజత్‌ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడ కాంపాటి రవిబాబు అనే ఆర్‌ఎంపీ బాలుడికి ఇంజెక్షన్‌ ఇచ్చి మందు రాసి ఇంటికి పంపించాడు. అయితే సాయంత్రానికి బాలుడి ఆరోగ్యం మరింత విషమించడంతో తిరిగి అదే క్లినిక్‌కు తీసుకెళ్లగా మరో సారి ఇంజెక్షన్‌ ఇచ్చాడు. అనంతరం బాలుడి కడుపు ఉబ్బిపోవడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వెంటనే పెద్ద ఆస్పత్రికి తరలించాలని సదరు ఆర్‌ఎంపీ సూచించాడు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే బాలుడు అదేరోజు రాత్రి మృతి చెందాడు. బాలుడి మృతికి కారణం ఏమిటని ప్రశ్నించేందుకు కుటుంబీకులు క్లినిక్‌ వెళ్లగా అప్పటికే ఆర్‌ఎంపీ క్లినిక్‌, మెడికల్‌ షాపునకు తాళం వేసి పరారయ్యాడు. కాగా, ఇదే ఆర్‌ఎంపీ వైద్యం వికటించి మండలంలోని ఉల్లెపల్లికి చెందిన కొలిచెల్మ మల్సూర్‌, మహేశ్వరి దంపతులు కుమార్తె మణిదీప (3) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా బ్రూణ హత్య కేసులో సదరు ఆర్‌ఎంపీపై గతంలో కేసు నమోదు కాగా, జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అయినా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల అండదండలతో దర్జాగా క్లినిక్‌ కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల అప్రమత్తం..

ఈ ఘటన నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ ఆధ్వర్యంలో మరిపెడలో తనిఖీలు నిర్వహించి స్థాయికి మించి వైద్యం చేస్తున్న పరారీలో ఉన్న రవిబాబు క్లినిక్‌తో పాటు మరో రెండు గుడిసె వెంకన్న, వీరన్న ఆర్‌ఎంపీలకు చెందిన ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, తమ కుమారుడి మృతికి కారణమైన ఆర్‌ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు అధికారులను వేడుకున్నారు. ఘటనపై మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మరిపెడలో ఘటన

బాధితులు వచ్చేలోపు క్లినిక్‌కు తాళం వేసి పరారైన గ్రామీణ వైద్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement