ఆరుతడి పంటలు సాగు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈమేరకు రైతులు వరికి బదులు తక్కువ సాగునీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచి స్తోంది. ఈమేరకు విత్తన మేళా ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు అందించేందుకు గాను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
వర్షాభావ పరిస్థుతుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు వైపునకు రైతులు మళ్లేలా, పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను వివరిస్తారు. అలాగే ఈ నెల 27నుంచి 29 వరకు జిల్లాలోని 18 మండలాల్లో రైతు వేదికల వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
బయ్యారం మండల పరిధి కొత్తపేట రైతు వేదిక, చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లి, దంతాలపల్లి, డోర్నకల్ మండల పరిధి అమ్మపాలెం, గంగారం, గార్ల, గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, కొత్తగూడ మండల పరిధి పొగుళ్లపల్లి, కురవి, మహబూబాబాద్, మరిపెడ మండల పరిధి గిరిపురం, నర్సింహులపేట, నెల్లికుదురు, పెద్దవంగర, సీరోలు మండల పరిధి కాంపల్లి, తొర్రూరు రైతు వేదికల్లో విత్తనమేళాలు నిర్వహించనున్నారు.
విత్తనమేళాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తన శుద్ధి, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర పురుగు, వ్యాధి నివారణ, నీటి యాజమాన్యం, శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించనున్నారు.
వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల ప్రభుత్వం, వ్యవసాయ, ఉద్యా న శాఖల ఆధ్వర్యంలో రైతుల అవసరాల మేరకు విత్తన మేళాలో పెసర, మినుములు, కందులు, జొన్నలు, కూరగాయల విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు.
జిల్లాలోని మండలాల్లో ఎంపిక చేసిన రైతు వేదికల్లో సోమవారం నుంచి బుధవారం వరకు విత్తన మేళా నిర్వహిస్తారు. కాగా రైతులు తమ భూభాగం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటలకు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.
రైతులు ఏజెన్సీల నుంచి మాత్రమే ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేసి రశీదులను భద్రపరచుకోవాలి. తద్వారా ఏదైనా సమయంలో పంట నష్టం జరిగితే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
నేటి నుంచి మూడు రోజుల
పాటు నిర్వహణ
ఎల్‌నినో ప్రభావంతో ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు
అందుబాటులో నాణ్యమైన విత్తనాలు
ప్రస్తుత వాతావరణ పరి స్థితులు పంటల సాగుకు అనుకూలంగా లేనందువల్ల రైతులు ఆరుతడి పంటలు సాగు చేయడం శ్రేయస్కరం. ఎంపిక చేసిన రైతు వేదికల్లో ఏర్పాటు చేస్తున్న విత్తన మేళాలకు వచ్చి రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళ్లాలి. పెసర, మినుములు, కందులు, జొన్నలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
–ఎస్.విజయచంద్ర,
జిల్లా వ్యవసాయ అధికారి


