సైబర్‌ వల.. విలవిల | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ వల.. విలవిల

Jul 27 2026 1:42 AM | Updated on Jul 27 2026 1:42 AM

మోసపోతే వెంటనే 1930కు కాల్‌ చేయాలి

మహబూబాబాద్‌ రూరల్‌ : సైబర్‌ నేరగాళ్ల వలలోపడి తెలివిగల మేధావులు మోసపోతున్న సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్‌ మోసాలపై అప్రమత్తత తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నప్పటికీ చాలామంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డబ్బులు కోల్పోయి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు..

ఫేస్‌బుక్‌ ప్రకటనల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ ఇన్వెస్ట్‌మెంట్‌ వెబ్‌సైట్లలో పెట్టుబడులు పెట్టించడం, టెలిగ్రామ్‌ ట్రేడింగ్‌ గ్రూపుల పేరుతో మోసాలకు పాల్పడటం, బ్యాంకు అధికారులు లేదా కంపెనీ ప్రతినిధులమని చెప్పి యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌లను ఆమోదింపజేయడం, బ్యాంకింగ్‌ వివరాలను సేకరించి అనధికారిక లావాదేవీలు నిర్వహించడం, వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

అప్రమత్తతే ఆయుధం..

జిల్లాలో ఇటీవల సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు అధికారులు సూచిస్తున్నారు. జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎంసీఆర్‌పీ), సైబర్‌ హెల్ప్‌లైన్‌ 1930 ద్వారా జిల్లాలో నమోదైన ఫిర్యాదుల ప్రకారం సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.

జిల్లాలో జనవరి నుంచి నమోదైన సైబర్‌ మోసాల వివరాలు..

● మరిపెడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ పెట్టుబడి వెబ్‌సైట్‌ ద్వారా రూ.1.50 లక్షలు మోసం జరిగింది.

● నెల్లికుదురు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనధికారిక ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీ ద్వారా రూ.3.50 లక్షలు కోల్పోయారు.

● డోర్నకల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనధికారిక ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీ ద్వారా రూ.లక్ష నష్టం జరిగింది.

● కేసముద్రం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో టెలిగ్రామ్‌ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో రూ.1.71 లక్షలు మోసం చేశారు.

● కురవి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేసి ఘటనపై కేసు నమోదైంది.

● బయ్యారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ (ఫోన్‌పే) మోసం ద్వారా రూ.9,879 కోల్పోయారు.

● మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నకిలీ ఇన్వెస్ట్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ ద్వారా రూ.49 వేలు మోసపోయారు.

● జిల్లాలో 7 సైబర్‌ ఫిర్యాదులు నమోదు కాగా రూ.8,29,879 మేర ఆర్థిక నష్టం జరిగినట్లు గుర్తించారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

● అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలను నమ్మవద్దు.

● తెలియని వ్యక్తులు పంపిన యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ను ఆమోదించవద్దు.

● ఓటీపీ, యూపీఐ పిన్‌, సీవీవీ, బ్యాంకు పాస్‌వర్డ్‌ ఎవరితోనూ పంచుకోవద్దు.

● పెట్టుబడిపెట్టే ముందు సంబంధిత సంస్థ, వెబ్‌సైట్‌ విశ్వసనీయతను నిర్ధారించుకోవాలి.

● టెలిగ్రామ్‌, వాట్సాప్‌లో తెలియని ఇన్వెస్ట్‌ మెంట్‌ గ్రూపుల్లో చేరవద్దు.

● వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బెదిరించినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

● ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు.

● బ్యాంకు ఖాతాల లావాదేవీలకు అలర్ట్‌లను యాక్టివేట్‌ చేసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.

సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930 హెల్‌లైన్‌ కాల్‌ చేయాలి లేదా సైబర్‌ క్రైం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. వెంటనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును ఫ్రిజ్‌ చేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వృద్ధులకు సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించాలి.

– శబరీష్‌, ఎస్పీ

ఆదమరిస్తే అంతే సంగతులు

ఎక్కువగా మోసపోతున్న మేధావులు

అప్రమత్తత తప్పనిసరి

జిల్లాలో జనవవరి నుంచి రూ.8,29,879 మేర ఆర్థిక నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement