సాక్షిప్రతినిధి, వరంగల్: ఉత్తర భారతంలోని హరియాణ రాష్ట్రాన్ని.. దక్షిణ భారతంలోని తిరుపతితో అనుసంధానించే హిసార్–తిరుపతి–హిసార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇకపై శాశ్వత (రెగ్యులర్) రైలుగా సేవలందించనుంది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడుస్తున్న ఈ సర్వీసును రెగ్యులర్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా కొత్త రైలు నంబర్లను కూడా కేటాయించింది. కాగా, గతంలో 04717/04718 నంబర్లతో నడిచిన ఈ రైలు ఇకపై 14723/14724 నంబర్లతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ శనివారం హిసార్ నుంచి (14723) ప్రతీ సోమవారం తిరుపతి నుంచి (14724) ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుందని రైల్వేశాఖ తెలిపింది.
ఆరు రాష్ట్రాలు.. 43.20 గంటల ప్రయాణం..
దాదాపు 2,492 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రయాణం ద్వారా హరియాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఈ రైలు అనుసంధానిస్తుంది. మొత్తం ప్రయాణానికి సుమారు 43 గంటల 20 నిమిషాలు పడుతుంది. హిసార్‌లో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరిన రైలు రాజస్తాన్‌లోని సదల్‌పూర్, జైపూర్, మధ్యప్రదేశ్‌లోని నగడ, ఉజ్జయిని, భోపాల్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, బల్లార్షా మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అనంతరం సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్, ఖమ్మం స్టేషన్లలో ఆగి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
23 బోగీలతో రైలు.. ప్రయాణికులకు ఊరట
ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 23 బోగీలు ఉంటాయి. వీటిలో 2 ఏసీ–2 టియర్, 7 ఏసీ–3 టియర్, 8 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో పాటు 2 సెకండ్ క్లాస్ కమ్ లగేజీ ర్యాక్ కోచ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సర్వీసును రెగ్యులర్ చేయడంతో ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం ప్రాంతాల ప్రయాణికులు కూడా ఈ సర్వీసుతో ప్రయోజనం పొందనున్నారు.
ఉమ్మడి వరంగల్ వాసులకు ప్రయోజనమే..
హిసార్–తిరుపతి వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు శాశ్వత హోదా కల్పించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రయాణికులకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. వరంగల్‌లో ఈ రైలు ఆగుతుండడంతో ఉత్తర భారతంలోని హరియాణ , రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సైనిక సిబ్బంది, యాత్రీకులు నేరుగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఖమ్మం స్టేషన్‌లో కూడా ఆగుతుండడంతో మహబూబాబాద్, డోర్నకల్, కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ రైలును సులభంగా వినియోగించుకోగలరు. తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఈ సర్వీస్ మరో ప్రత్యామ్నాయంగా మారనుంది. ప్రత్యేక రైలుగా కాకుండా రెగ్యులర్ సర్వీస్‌గా మారడంతో టికెట్ల లభ్యత, సేవల నిరంతరతపై ప్రయాణికుల్లో విశ్వాసం పెరగనుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నుంచి ఉత్తర భారత రాష్ట్రాలకు నేరుగా వెళ్లే వారానికి ఒక స్థిరమైన రైలు సర్వీస్ అందుబాటులోకి రావడం ప్రాంతీయ ప్రయాణ అవసరాలను కొంత మేర తీర్చనుంది.
ఇకపై ప్రతీ వారం రెగ్యులర్ సర్వీస్
ఉత్తర–దక్షిణ భారతాన్ని కలిపే 2,492 కిలోమీటర్లు..
సూపర్‌ఫాస్ట్‌కు కొత్త రైలు నంబర్లు
తెలంగాణలో వరంగల్,
ఖమ్మం మీదుగా రాకపోకలు


