పార్క్‌ చేసిన బైక్‌కు నిప్పుపెట్టిన దుండగులు | - | Sakshi
Sakshi News home page

పార్క్‌ చేసిన బైక్‌కు నిప్పుపెట్టిన దుండగులు

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

ఖిలా వరంగల్‌ : ఇంటి ఎదుట పార్క్‌ చేసిన బైక్‌కు దుండగులు నిప్పు పెట్టి తగుల బెట్టారు. ఈఘటన శుక్రవారం అర్ధరాత్రి ఖిలా వరంగల్‌ పడమరకోటలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. పడమరకోటకు చెందిన పొన్నం అశోక్‌కు పొన్నం శ్రీనివాస్‌, స్వరూప, అతడి కుమారుడు అజయ్‌ మద్య ఇంటి హద్దు రాళ్ల విషయంపై శుక్రవారం గొడవ జరిగింది. అదే రోజు సాయంత్రం అశోక్‌ తన ఇంటి ఎదుట సీసీ రోడ్డు పై బైక్‌ను పార్క్‌ చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయాన పార్క్‌ చేసిన బైక్‌పై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్‌పోసి నిప్పంటించి పరారయ్యారు. మంటలు ఎగిసిపడంతో స్థానికులు నిద్ర లేచి చూసే సరికే బైక్‌ మంటల్లో కాలిపోతోంది. వెంటనే నీల్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే 60శాతం వరకు కాలిపోయి రూ. 50వేలు నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై బాధితుడు పొన్నం అశోక్‌ ఆదివారం మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

చేపల వేటకు వెళ్లి మృత్యుఒడికి..

గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

అయ్యవారిపేటలో ఘటన

వాజేడు: చేపల వేట కోసం వెళ్లి ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరుకున్నాడు. గోదావరిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని అయ్యవారిపేటలో చోటు చేసుకుంది. పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్‌, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గౌరారపు రామచందర్‌(55) మరో వ్యక్తితో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల వేట అనంతరం స్నానం చేయడానికి రామచందర్‌ గోదావరిలోకి దిగి లోతు తెలియకపోవడంతో మునిగి పోయాడు. మరో వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో గ్రామస్తుల సాయంతో ఎస్సై కృష్ణ ప్రసాద్‌ గాలింపు చర్యలు చేయించి మృతదేహాన్ని బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, మృతుడికి భార్య సావిత్రి, నలుగురు కూతుళ్లు ఉండగా ముగ్గురికి వివాహం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement