విజిలెన్స్‌ దడ! | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ దడ!

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు

నాలుగు మిల్లుల తనిఖీలు..

ఇద్దరిపై కేసు నమోదు

ఎప్పుడు ఏ మిల్లుకు వెళ్తారో తెలియని పరిస్థితి

ధాన్యం నిల్వలేని మిల్లర్లలో వణుకు..

రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై నిఘా

సాక్షి, మహబూబాబాద్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) పెట్టాలి. అయితే మిల్లర్లు సకాలంలో బియ్యం పెట్టకుండా మొండికేయడం, జాప్యం చేయడం, ధాన్యం నిల్వలు లేకుండా అమ్ముకోవడంపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాలుగు మిల్లులను తనిఖీ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేయడంతో.. ఎప్పుడు ఏ మిల్లులో తనిఖీ నిర్వహిస్తారో అని అక్రమాలకు పాల్ప డిన రైస్‌ మిల్లుల యజమానుల్లో దడ మొదలైంది.

రూ.130కోట్ల బకాయిలు..

ధాన్యం దిగుమతి చేసుకొని రూ.130కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా మిల్లర్లు మొండికేస్తున్నారు. జిల్లాలో 2017–22 మధ్యకాలంలో యాసంగి, వానాకాలం సీజన్‌లలో సీఎంఆర్‌ పెట్టని ఐదు మిల్లుల యజమానులు రూ.15కోట్లు బకాయి పడ్డారు. దీంతో ఇప్పటికే వారిపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌కింద కేసులు నమోదు చేశారు. 2021–22 సీజన్‌లో ధాన్యం తీసుకొని 10 రైస్‌మిల్లుల యజమానులు సుమారు రూ.15కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 2022–23 సీజన్‌లో ధాన్యం దిగుమతి చేసుకున్న 21మంది మిల్లర్లు సీఎంఆర్‌ పెట్టలేదు. అయితే ఆ ధాన్యాని ప్రభుత్వం ఇతర వ్యాపారులకు వేలం ద్వారా కేటాయించింది. కాగా, వేలం వేసిన వారికి ధాన్యం ఇవ్వకుండా ఉన్నారు. ఇలా వీరి వద్ద నుంచి సుమారు రూ. 95కోట్లు రావాల్సి ఉంది. అయితే వీరికి ఆగస్టు 4వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అదే విధంగా ఆలస్యంగా పెట్టిన వారు రూ. 5కోట్ల బకాయి ఉన్నారు. ఇలా జిల్లాలో మొత్తం రూ. 130కోట్ల విలువ చేసే బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. దీనికి తోడు 2025–26 ఖరీఫ్‌లో దిగుమతి చేసుకున్న సన్నధాన్యం కూడా పలువురు మిల్లర్లు పక్కదారికి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ధాన్యం నిల్వలు లేకుంటే చర్యలు

కొనుగోలు కేంద్రం నుంచి దిగుమతి చేసుకున్న ప్రతీ గింజా ధాన్యానికి లెక్క ఉండాలి. అయితే సీఎంఆర్‌ పెట్టాలి. లేకుంటే ధాన్యం నిల్వ ఉండాలి. అలా కాకుండా ధాన్యం అమ్ముకుంటే కేసులు పెట్టడమే కాకుండా రికవరీ చేస్తాం. వారం రోజులుగా జిల్లాలో నాలుగు మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. రెండు మిల్లుల యజమానులపై కేసులు పెట్టారు.

–రమేశ్‌, డీఎస్‌ఓ

ఆకస్మిక తనిఖీలతో ఉక్కిరి బిక్కిరి..

జిల్లాలో వారం రోజులుగా రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేయడంతో యజమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలోని తిరుమల బిన్నీ రైస్‌ మిల్లు, బాలాజీ పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లు, వాసవి లక్ష్మీ రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. మిల్లుకు దిగుమతి అయిన ధాన్యంలో మిల్లింగ్‌ చేసిన ధాన్యం పోగా.. మిగిలిన నిల్వల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో రెండు మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. అయితే ఒక మిల్లు యజమాని అనారోగ్యంతో మంచానికి పరిమితం కాగా.. మరో యజమానిని అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అదే విధంగా శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలోని ప్రజ్వల రైస్‌ మిల్లును కూడా విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అయితే అక్కడ నిల్వల్లో తేడా ఉందా.. లేదా అనే విషయం బయటకు రాలేదు. ఇలా ఆకస్మికంగా మిల్లులను తనిఖీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతర రైస్‌ మిల్లుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెడితే సమాజంలో పరువు పోతుందని కొందరు సీఎంఆర్‌ పెట్టేందుకు సిద్ధం కావడం, డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నిల్వల్లో తేడా ఉన్న పలువురు మిల్లర్లు మాత్రం ఏం జరిగితే అది జరుగుతుందని అనుచరులతో చెబుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement