మహబూబాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని జేఎన్‌న్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విద్యార్థులకు పురుగుల అన్నం, ఇరుకు గదులు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో మంగళవారం విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేశారు. జిల్లా కేంద్రంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో 3 కోర్సులతో ప్రారంభించగా ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రకల్ కమ్యూనికేషన ఇంజనీరింగ్, ఈఈఈ, మోకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. బాలికలు, బాలురు కలుపుకొని మొత్తం 750 మంది విద్యార్థులతో ప్రస్తుతం కళాశాల తరగతులు కొనసాగుతున్నాయి. అన్ని కోర్సులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నా కళాశాలలో కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు.
ఇరుకు గదుల్లో ఇబ్బందులు
ఇంజనీరింగ్ కళాశాల భవనంలో మొత్తం ఆరు గదుల్లో రెండు గదుల్లో ల్యాబ్‌లు, నాలుగు గదుల్లో తరగతులు నిర్వహిస్తారు. ఒక్కొక్క గదిలో సుమారు 50 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌లో సుమారు 300 మంది బాలికలు ఉంటున్నారు. బాలురలకు హాస్టల్ సౌకర్యాలు లేక దూరంలో అద్దె భవనంలో ఉంటున్నారు.
పురుగుల అన్నం, నీళ్ల చారు..
బాలికల హాస్టల్‌లో పురుగుల అన్నం, నీళ్ల చారు, రుచి పచిలేని టిఫిన్ తినలేక విద్యార్థులు ఆన్‌లైన్‌లో భోజనం తెప్పించుకుని తింటున్నారు. టిఫిన్, భోజనం, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల మరమ్మతుపై వార్డెన్, సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే ‘మా దగ్గర ఇలానే ఉంటాయి. ఇష్టమైతే చదువుకో లేకపోతే హాస్టల్‌లో ఉండకు’ అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని బాలికలు వాపోతున్నారు. ఈ విషయమై హాస్టల్‌లో ఏఎన్‌ఎం, వాచ్‌మెన్, మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై సుమారు 3 గంటలపాటు ధర్నా నిర్వహించారు. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు, తహసీల్దార్, కళాశాల ప్రిన్సిపాల్ బలరాం నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని త్వరలోనే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ధర్నాలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల వలయంలో
ఇంజనీరింగ్ కళాశాల
మౌలిక వసతులు కల్పించాలని
విద్యార్థుల ఆందోళన


