సెలవులొస్తే దిగులు! | - | Sakshi
Sakshi News home page

సెలవులొస్తే దిగులు!

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

తల్లిదండ్రులు లేని విద్యార్థుల ఆందోళన

సాక్షి, మహబూబాబాద్‌: పాఠశాలల పిల్లలకు వేసవి సెలవులు అంటే చెప్పలేని ఆనందం. సెలవుల్లో ఎలా ఎంజాయ్‌ చేయాలనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా వినోద, విహారయాత్రలు, ఊర్లకు వెళ్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఆయా విద్యాలయాల్లో చదివే తల్లిదండ్రులు లేని, తల్లి లేదా తండ్రి లేని వారు.. ఉన్నా వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవించే కుటుంబాల పిల్లలకు మాత్రం వేసవి సెలవులు శాపంగా మారుతున్నాయి. తోటి విద్యార్థులు వెళ్తుంటే.. తాము ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి వారిది. దీంతో సెలవులు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ ఆవేదన, ఆందోళన చెందుతున్నవారు ఉన్నారు.

4వేలకు పైగా పిల్లలు..

జిల్లాలో తల్లిదండ్రులు లేని వారు, తల్లి లేదా తండ్రి లేని విద్యార్థులు 4వేలకు పైగా ఉంటారని అంచనా. వీరందరూ జిల్లాలోని సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకులా లు, జ్యోతిరావుపూలే గురుకులాలు, మైనార్టీ, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో చదువుతున్నారు. అన్ని సొసైటీల్లో కలిపి19,188మంది పిల్లలు ఉన్నారు. ఇందులో500మంది ఆర్పన్స్‌, మరో 3,500కు పై గా సెమీ ఆర్పన్స్‌ ఉన్నట్లు అధికారులు చెబుతున్నా రు.

మొక్కుబడిగా క్యాంపులు..

అనాథ పిల్లల కోసం ప్రతీ వేసవిలో ప్రభుత్వం క్యాంపులు పెడుతోంది. అయితే ఈ క్యాంపుల్లో సరైన వసతులు ఉండకపోవడం, మెనూ సక్రమంగా పెట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపుల్లో ఉన్న విద్యార్థులకు సంగీతం, చిత్రలేఖనం, పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సంతోషాన్ని నింపాలని అధికారులు చెబుతున్నా.. అది ఆచరణకు నోచుకోవడం లేదు. అదే విధంగా క్యాంపుల్లో ఉన్న విద్యార్థులను వేసవిలో టూర్లకు తీసుకెళ్లడం, కొత్త ప్రదేశాలను చూపించి వారిలో ఆనందాన్ని నింపాల్సి ఉంది. కానీ, అలాంటి పరిస్థితి వేసవి క్యాంపుల్లో ఉండడం లేదని, అందుకోసమే క్యాంపులకు వెళ్లడం కన్నా.. దూరపు బంధువుల ఇళ్లకు వెళ్లి సెలవుల్లో తల దాచుకుంటున్నామని పిల్లలు అంటున్నారు.

క్యాంపులకు సిద్ధమవుతున్నాం..

ప్రతీ సంవత్సరం మాదిరిగానే కేజీబీవీల్లో చదివే బాలికలకోసం ప్రత్యేక సమ్మర్‌ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే క్యాంపుల నిర్వహణ, వసతులతో పాటు మొదలైన ఏర్పాట్లు చేస్తాం. విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాంపులు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తాం.

– రాజేశ్వర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

హాస్టళ్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి

వేసవి సెలవుల్లో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి

క్యాంపులు ఏర్పాటు చేసినా

అంతంతమాత్రంగా వసతులు

అనాథ పిల్లలకోసం ప్రణాళిక ఖరారులో జాప్యం

ఖరారు కాని సమ్మర్‌ క్యాంపులు

మరో పదిరోజుల్లో వేసవి సెలవులు మొదలు అవుతాయి. కానీ ఇప్పటి వరకు క్యాంపుల విషయం తేలలేదు. గత ఏడాది జిల్లాలోని 16 కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు గూడూరు కేజీబీవీలో క్యాంపు పెట్టారు. ఇప్పుడు ఎక్కడ క్యాంపు పెట్టే విషయంపై స్పష్టత రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement