స్టేషన్‌ఘన్‌పూర్ : ఘన్‌పూర్ శివారు పుట్టలమ్మ కుంట చెరువులో దాదాపు రెండు టన్నుల చేపలు అనుమానాస్పదంగా మృత్యువాత పడిన సంఘటన శనివారం జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ మత్స్యసొసైటీ నాయకులు, మత్స్యకారుల కథనం ప్రకారం.. పుట్టలమ్మ చెరువులో చేపలు ఈసారి భారీగా పెరిగాయని, ఒక్కొ చేప కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు వచ్చాయని తెలిపారు. అయితే శనివారం ఉదయం చూసేసరికి వందల సంఖ్యలో చేపలు మృతిచెంది నీటిపై తేలుతూ ఉన్నాయని పేర్కొన్నారు. అసలేం జరిగిందో తెలియడం లేదని, ఎవరైనా కుట్రపూరితంగా నీళ్లలో విషగుళికలు కలిపి ఉంటారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.5లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ విషయమై మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఘన్‌పూర్ మత్స్యసొసైటీ చైర్మన్ నీల సోమన్న, నాయకులు గోనెల ఐలోని, అనిల్‌కుమార్, వెంకన్న, మాజీ ఎంపీటీసీలు మునిగెల రాజు, గోనెల రాజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రూ.5లక్షల మేర నష్టం
ఆదుకోవాలని మత్స్యకారుల వేడుకోలు


