మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు సగానికిపైగా వాహనాలు మరమ్మతుల బారిన పడడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే దోమల సంఖ్య పెరిగి కంటి మీద కనుకులేకుండా పోతుందని, రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ పనితీరుపై పలువురు కౌన్సి లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలను కూడా కమిషనర్ పట్టించుకోవడం లేదు. ఇటీవల కార్యాలయం నిర్వహణ విషయంలో కలెక్టర్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
లక్షకుపైగా జనాభా..
జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ మానుకోట. మన్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. కాగా విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. 12 ట్రాక్టర్లు, 19 నాలుగు చక్రాల ఆటోలు, 14 మూడు చక్రాల ఆటోలు ఉండగా వాటిలో సగానికిపైగా మరమ్మతుల బారిన పడ్డాయి. వాటితో పాటు రోడ్డు స్వీపింగ్ మిషన్, కాల్వలు శుభ్రం చేసే మిషన్లు మరమ్మతుల బారిన పడి తుప్పు పడుతున్నాయి. ప్రతీరోజు 33 టన్నుల చెత్తసేకరణ చేసి సిగ్నల్ కాలనీ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డు, గాంధీపురం శివారులోని చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
143 మంది కార్మికులు..
మున్సిపాలిటీలో 36 వార్డులకు కేవలం 143 కార్మికులు ఉండగా వారిలో కొంత మంది హాజరు కాకపోవడంతో పాటు కొంత మంది కార్మికులు అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. సిబ్బంది కొరత, వాహనాల మరమ్మతులతో కొన్ని వార్డుల్లో రోజు వాహనం రాకపోవడంతో ప్రజలు రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దోమలు, పందుల సంఖ్య పెరుగుతోంది. ఫాగింగ్ కూడా నామమాత్రంగా చేస్తున్నారు.
కాల్వలు తీయడం మరిచారు..
చాలా కాలనీల్లో కాల్వలను శుభ్రం చేయడం లేదు. కాల్వలు చెత్తాచెదారంతో నిండాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతోందని ఆయా ప్రాంతాల ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల విషయంలో పలుమార్లు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని అంటున్నారు.
కమిషనర్ తీరుపై అసంతృప్తి..
మున్సిపల్ కమిషనర్ కేవలం కార్యాలయానికే పరిమితమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం సమయంలో మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో బిల్లులు, ఫైళ్లు ఇతరత్రా విషయాలపై మాట్లాడుతున్నారు. పర్సంటేజీ లెక్కలు చూసుకుంటున్నారే తప్ప..పారిశుద్ధ్యం, ఇతర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో కార్మికులు కాలనీల్లో తూతూమంత్రంగా పని చేస్తున్నారు.
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు
ఈనెల 10న మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఆసమావేశంలో పారిశుద్ధ్యం, పందుల సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కమిషనర్‌ను ఆదేశించారు. పందుల పెంపకందారులతో సమావేశమై, పందులను పట్టణానికి దూరం ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ, నేటి వరకు పందుల పెంపకందారులతో సమావేశం పెట్టలేదు.
కలెక్టర్ సీరియస్..
ఈనెల 11న కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న ఫైళ్లు, బీరువాలు, చెత్తాచెదారం చూసి కలెక్టర్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, నేటికి కార్యాలయంలో నిర్వహణ పనులు చేయకపోవడంతో పాటు ఎక్కడి చెత్త అక్కడే ఉంది. కనీసం కార్యాలయంలో బూజు కూడా శుభ్రం చేయించడం లేదు. కమిషనర్‌ను బదిలీ చేస్తే మానుకోట మున్సిపాలిటీలో పాలన గాడిన పడుతుందని పలువురు కౌన్సిలర్లు, ప్రజలు విమర్శిస్తున్నారు.
మానుకోట పట్టణంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
అసంపూర్తి కాల్వలతో అపరిశుభ్రంగా పరిసరాలు
కాలనీల్లో పందుల స్వైరవిహారం
కమిషనర్ తీరుపై కౌన్సిలర్ల అసంతృప్తి


