● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితంగా ఉందని, అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నానా తంటాలు పడుతున్నారని, దానిలో పర్సంటేజీలు తీసుకొని బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల విషయంలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, రావుల రవిచందర్‌రెడ్డి, ముత్యం వెంకన్న, గుండా రాజశేఖర్, అశోక్, నాయిని రంజిత్‌రెడ్డి, నరేశ్, లక్ష్మణ్, రాము, సరోజ, పల్లా రాంచంద్రారెడ్డి, ఆదిల్, మహబూబ్ పాషా, తేళ్ల శ్రీనివాస్, రఘు తదితరులు పాల్గొన్నారు.


