వెనకడుగు | - | Sakshi
Sakshi News home page

వెనకడుగు

Mar 22 2026 5:31 AM | Updated on Mar 22 2026 5:31 AM

సాక్షి, మహబూబాబాద్‌: ప్రతీ సంవత్సరం ప్రభుత్వం విడుదల చేసే సామాజిక, ఆర్థిక నివేదికలో జిల్లా వెనకబడింది. స్థూల జాతీయ, తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే వెనకబడి ఉంది. పంటల సాంద్రతలో మధ్యస్థంగా ఉండగా.. ఉత్పత్తి రంగంలో వెనకడుగు, అటవీ విస్తీర్ణంలో మొదటి పది స్థానాల్లో జిల్లాకు తొమ్మిదో స్థానం దక్కింది. అక్షరాస్యత వంటి అంశాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది.

జీడీడీపీలో వెనకబడి

సంవత్సర కాలంలో జిల్లాలో ఉత్పత్తి చేసే వస్తుసేవల విషయంలో ఇతర జిల్లాలతో పోలిస్తే మానుకోట వెనకబడి ఉంది. స్థూల జాతీయ ఆదాయంలో రాష్ట్రంలో రూ.3,41,080కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలువగా మహబూబాబాద్‌ జిల్లా రూ.23,060 కోట్లతో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో వ్యవసాయం మినహా ఇతర ఉత్పత్తి చేసే అవకాశం లేనందున ఈ పరిస్థితి నెలకొంది. కనీసం వ్యవసాయ పంటల ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమలు పెడితే జీడీపీ పెరిగే అవకాశం ఉంది.

తలసరి ఆదాయంలో 29వ స్థానం

తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో మొదటి స్థానంలో నిలువగా రూ.2,56,485తో మానుకోట రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచింది. అయితే ఉపాధి అవకాశాలు తగినంతగా లేకపోవడం.. సంవత్సరంలో పనిదొరికే రోజుల సంఖ్య తగ్గడంతో తలసరి ఆదాయం కూడా తగ్గినట్లు స్పష్టమవుతుంది.

ఉపాధి హామీలో మెరుపులు

ప్రతీ ఒక్కరికి పనికల్పించి, వలసలను నివారించాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లా కాస్త మెరుగ్గా ఉంది. గడిచిన ఏడాది జిల్లాలో 28.6లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో జిల్లాలో 26.5లక్షల పనిదినాలు అంటే 92.40శాతం లక్ష్యం చేరుకొని జిల్లాను మెరుగైన స్థానంలో నిలపారు.

తొంభైశాతం గ్రామీణప్రాంతమే..

జిల్లాలో మొత్తం 482 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం.. మొత్తం జనాభా 7,74,549 మంది ఉండగా ఇందులో గ్రామీణ ప్రాంతంలో 6,98,173 మంది నివసిస్తున్నారు. పట్టణాల్లో కేవలం 76,376 మంది మాత్రమే నివాసముంటున్నారు. అయితే 2016లో మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం కావడంతో విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో మార్పులు వచ్చాయి. తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, కేసముద్రం పట్టణాల్లో కూడా జనాభా పెరిగింది. దీంతో ప్రస్తుతం పట్టణ జనాభా 2లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.

52.61శాతం శ్రామికులు

జిల్లా జనాభాలో 52.61శాతం మంది శ్రామిక వర్గం ఉంది. రైతులు 1,22,597 మంది, వ్యవసాయ కూలీలు 2,04,458 మంది, కుటీర పరిశ్రమలు, కులవృత్తులు చేసేవారు 7,427మంది, ఇతర శ్రామికులు 73,002 మంది మొత్తం 4,07,484 మంది శ్రమనే నమ్ముకొని జీవిస్తున్నవారున్నారు.

సీ్త్ర, పురుషుల నిష్పత్తి ఆందోళనకరం

సీ్త్ర, పురుషుల నిష్పత్తిలో జిల్లా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో సీ్త్ర, పురుషుల నిష్పత్తి 995 మంది, పట్టణ ప్రాంతంలో 1,035గా ఉంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల నిష్పత్తి సగటున 903కు పడిపోయింది. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 901, పట్టణ ప్రాంతంలో 917 ఉంది. దీంతో జాతీయ ఆరోగ్య సంస్థ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి ఆబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలపై ఆరా తీస్తుంది.

సగటున 2.04 ఎకరాల భూమి

వ్యవసాయమే ఆధారంగాఉన్న జిల్లాల్లో మహబూబాబాద్‌ ఒకటి. జిల్లాలో సగటున వ్యవసాయం చేసే రైతులకు 2.04 ఎకరాల చొప్పున భూమి ఉంది. ఇందులో షెడ్యూల్‌ కులాలకు చెందిన 15,676 మంది చేతిలో 8,414 ఎకరాలు, షెడ్యూల్‌ తెగలకు చెందిన 81,735 మంది చేతిలో 63,568 ఎకరాలు ఉంది. ఇతర వర్గాలకు చెందిన 91,398 మంది ఆధీనంలో 91,645 ఎకరాలు ఉంది.

పశుసంపద ఇలా..

జిల్లాలో 1.82 లక్షల పశువులు, 1.30 లక్షల గేదెలు, 6.78 లక్షల గొర్రెలు, 1.78లక్షల మేకలు, 8 వేల పందులు ఉన్నాయి. 11వేల కుక్కలు, 11.10 లక్షల కోళ్లు జిల్లాలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

జీడీడీపీలో 24వ స్థానంలో మానుకోట

తలసరి ఆదాయంలో 29వ స్థానం

ఉత్పత్తి రంగంలోనూ వెనుకే..

టాప్‌ టెన్‌లో అటవీ విస్తీర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement