కానరాని వార్డు అధికారులు | - | Sakshi
Sakshi News home page

కానరాని వార్డు అధికారులు

Mar 22 2026 5:31 AM | Updated on Mar 22 2026 5:31 AM

తొర్రూరు: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా వార్డుస్థాయి అధికారులను నియమించారు. ప్రతీ వార్డుకు ఒకరిని కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ అధికారులు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా వరకు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, ఫలితంగా వార్డుల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు కొలువైన నేపథ్యంలో వార్డు అధికారుల పనితీరు మెరుగుపడుతుందేమోనని ప్రజలు ఆశిస్తున్నారు.

పనులన్నీ అస్తవ్యస్తం..

జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 98 వార్డులు ఉన్నాయి. వార్డు పరిధిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోందన్న వాదనలున్నాయి. కోతులు, కుక్కల బెడద పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమస్య తీవ్రతను వార్డు అధికారులే ఉన్నతాధికారులకు నివేధించి చొరవ చూపాల్సి ఉంది. అసెస్‌మెంట్లు ఇష్టారీతిన సాగుతున్నాయి. డబ్బులిస్తే తప్ప కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనులు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికి అడ్డుకట్టపడాలన్నా, మున్సిపల్‌కు ఆదాయం సక్రమంగా సమకూరాలన్నా వార్డు అధికారుల పనితీరే అత్యంత కీలకం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపిక సర్వేలోనూ వార్డు అధికారులు చాలా మంది అంటీముట్టనట్లుగా ఉన్నారన్న విమర్శలు కోకొల్లలు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పని చేసిన కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న ప్రచారమూ జరిగింది. ఇలాంటి సందర్భాల్లో వారు కేవలం కార్యాలయానికే పరిమితమవుతూ, తమకు కేటాయించిన విధులపై అంతగా దృష్టిసారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పట్టణ వాసులను అసంతృప్తికి గురిచేస్తోంది.

జిల్లాలోని మున్సిపాలిటీల వివరాలు

మున్సిపాలిటీ వార్డులు

మహబూబాబాద్‌ 36

తొర్రూరు 16

మరిపెడ 15

డోర్నకల్‌ 15

కేసముద్రం 16

విధి నిర్వహణపై నిర్లక్ష్యం

కార్యాలయాలకే పరిమితం

క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement