● బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
మహబూబాబాద్: రైతుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెగిన చెరువు కట్టలకు వెంటనే శాశ్వత మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రరావు, గడ్డం అశోక్, మదన్‌లాల్ పాల్గొన్నారు.
గేట్‌లో సంతోష్‌కు 64వ ర్యాంక్
ఇనుగుర్తి: ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన గేట్‌లో గుగులోతు సంతోష్ 64వ ర్యాంక్ సాధించాడు. గురువారం రాత్రి విడుదలైన ఫలితాల్లో మండలంలోని మీట్యతండా గ్రామ పంచాయతీలోని మర్రికుంట తండాకు చెందిన గుగులోతు సుమన్, పద్మ దంపతుల కుమారుడు సంతోష్ 64వ ర్యాంకు సాధించాడు. ఆయన ఐఐటీ(బీహెచ్‌యూ)వారణాసిలో మైనింగ్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, సంతోష్ జాతీయస్థాయిలో ర్యాంక్ సాధించడంతో గ్రామస్తులు, బంధుమిత్రులు అభినందించారు.


