హన్మకొండ : విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సన్నద్ధం కావాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ట్రాన్స్‌కో విభాగం కన్వీనర్లు కందికొండ వెంకటేష్, పొగాకు భరత్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయం ఆవరణలో ట్రాన్స్‌కో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టిజన్ల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల సాధనకు దశవారీగా ఉద్యమం నిర్వహిస్తూ చివరి అస్త్రంగా ఏప్రిల్‌లో సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులు సంబంధిత అధికారి అనుమతి లేకుండా ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి విద్యుత్ సౌధకు వెళ్లొద్దని ఆంక్షలు విధించడం అన్యాయమని అన్నారు. చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యుత్ ఆర్టిజన్ జెఏసీ నాయకులు శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, జయచందర్, రాజేష్, సుజన, మల్లికార్జున్, శ్రీనివాస్, రజనీకాంత్, సంజీవ, కిరణ్, మధు, అశోక్, శ్రీలక్ష్మి, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.
కందికొండ వెంకటేష్


