భూపాలపల్లి అర్బన్ : దుండగులు నిప్పంటించడంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన బుధవారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు చల్లూరిపల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు చెలిమేటి లింగయ్య, సుగుణ దంపతుల కథనం ప్రకారం.. ఉగాది పండుగ సందర్భంగా బుధవారం రాత్రి లింగయ్య, సుగుణ దంపతులు తమ కుమారుడు సంతోష్ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో దుండగులు ఇంటికి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఇంటి పక్కన కట్టెసి ఉన్న 4 ఆవులు తీవ్రంగా గాయపడి నడవలేని స్థితికి చేరుకున్నాయి. 20కి పైగా నాటు కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో నిల్వ చేసిన 20 బస్తాల ధాన్యం, రూ.10 వేల నగదు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గాయపడిన పశువులకు వైద్యం చేయించేందుకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న 12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీశ్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సుమారు రూ.2 లక్షల వరకు
ఆస్తి నష్టం
మంటలతో పశువులకు గాయాలు
చల్లూరిపల్లిలో ఘటన


