కాజీపేట: పెరుగుతున్న ఎండలతో పాటు కొబ్బరి బోండాం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కొబ్బరిబోండాం వ్యాపారులు సీజన్‌ను ఆసరాగా చేసుకొని బోండాం ధరలను అధికంగా పెంచి విక్రయిస్తున్నారు. నగరానికి ఆంధ్రా ప్రాంతం నుంచి కొబ్బరిబోండాలు దిగుమతి చేసుకుంటారు. అయితే కొబ్బరిబోండాల ధరలు వ్యవసాయదారుడి వద్ద కొనుగోలు చేస్తున్న ధరలకన్నా మూడు రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.30, రూ.35 కు ఒక బోండాన్ని విక్రయించే వ్యాపారులు ప్రస్తుతం రూ.60 వరకు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొబ్బరిబోండాం కొనలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
చిన్న బాటిళ్లలో విక్రయాలు..
వ్యాపారులు చిన్న బాటిళ్లలో కొబ్బరి నీరు విక్రయిస్తూ అధిక ధరలు తీసుకుంటున్నారు. లీటర్ కొబ్బరి నీరు రూ.140కి విక్రయిస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో ధరలు ఇంకా పెంచి విక్రయిస్తున్నారని కొనుగోలు దారులు వాపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బోండాల దిగుబడి లేదు.. దూరం నుంచి తెప్పించి విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారని కొనుగోలు దారులు పేర్కొంటున్నారు.


