మహబూబాబాద్: గ్యాస్ కొరత లేదని.. సరిపోను నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. వ్యాపారులు, ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. అంతకుముందు గ్యాస్ బుక్ చేసిన మరుసటి రోజే సిలిండర్ డెలివరీ చేసేవారు కానీ ప్రస్తుతం వారం పది రోజులైనా డెలివరీ చేయడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ కొరత ఉందని నిర్వాహుకులు హోటళ్ల మూసివేస్తున్నారు.
2,11,531 కనెక్షన్లు..
జిల్లాలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2,11,531 గ్యాస్‌కనెక్షన్లు ఉన్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.924 ఉండగా రూ.984కు చేరింది. డెలివరీ బాయ్ అదనంగా తీసుకునే డబ్బులతో కలిపితే వినియోగదారులు రూ.1,000 చెల్లించాల్సి వస్తుంది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినా పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ, బుక్‌చేస్తే సుమారు వారం నుంచి పది తర్వాత సిలిండర్ వస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.
మూత పడుతున్న హోటళ్లు
జిల్లా కేంద్రంలో సుమారు 100కిపైగా హోటళ్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో సగానికిపైగా టిఫిన్ హోటళ్లు మూత పడ్డాయి. అయితే హోటళ్లు మూసివేయడానికి కేవలం గ్యాస్ కొరత, పెరిగిన ధరలే కారణమని నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఇక కొంత మంది వ్యాపారులు ఇదే అదునుగా టిఫిన్ ధరలు సుమారు రూ.10వరకు పెంచారు.
పెరిగిన వంట చెరుకు డిమాండ్..
క్వింటా వంట చెరుకు అంతకు ముందు రూ.600 ఉండగా ప్రస్తుతం రూ.800 తీసుకుంటున్నారు. గ్యాస్ కొరతతో మిల్లుల్లోని వంట చెరుకు పూర్తిగా అయిపోయింది. దాంతో వంట చెరుకు డిమాండ్ పెరిగింది. కర్రీ పాయింట్ నిర్వాహుకులు ఎక్కువగా వంట చెరుకుపై ఆధార పడుతున్నారు. పెద్ద హోటళ్లలో బట్టీలు ఉండడంతో వారు హోటళ్లు కొనసాగిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లనే వినియోగిస్తున్నట్లు సమాచారం.
కొరత లేదన్న మంత్రి
రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. సంబంధిత అధికారులు గ్యాస్ గోదాంలు, కార్యాలయాలు, హోటళ్లలలో తనిఖీలు చేస్తున్నారు. అధికారులు కొరతలేదని చెబుతున్నా.. వినియోగదారులు ఆయా ఏజెన్సీల వద్ద ఖాళీ సిలిండర్లతో క్యూలో ఉంటూనే ఉన్నారు. బుకింగ్ చేసి పదిరోజులు గడిచినా సిలిండర్లు రాకపోవడంతో ఏజెన్సీల వద్ద గంట తరబడి వినియోగదారులు పడిగాపులు గాస్తున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లా కేంద్రంలోని కొండపల్లి గోపాల్‌రావునగర్ కాలనీకి చెందిన మహ్మద్ సిద్దిక్ మాత్రం తన టిఫిన్ సెంటర్లో ధరలు పెంచకుండా కేవలం రూ.25కే అల్పాహారం అందిస్తున్నారు.
గ్యాస్ కొరత లేదు
గ్యాస్ కొరత లేదు. కానీ బుకింగ్ బాగా పెరిగింది. దాంతో డెలివరీ సమస్య మాత్రమే ఉంది. బ్లాక్‌లో విక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకున్నాం. బుకింగ్ పెరగడంతో డెలివరీ వారం రోజులు పడుతుంది. వినియోగదారులు సహకరిస్తే ఇబ్బందిలేకుండా చూస్తాం.
– బోనగిరి ప్రసాద్,
మేనేజర్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ, మానుకోట
పెరిగిన ధరతో చిరువ్యాపారులపై భారం
బుక్ చేస్తే వారం తర్వాతే సిలిండర్ డెలివరీ
పెరిగిన బుకింగులు..
ఆలస్యమవుతున్న సిలిండర్ల సరఫరా


