● హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ ఖుస్రూపాషా
ఎంజీఎం / న్యూశాయంపేట: పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య సంబంధించిన విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని యాత్రకు సన్నద్ధం కావాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా సూచించారు. వరంగల్ ఐఎంఏ హాల్‌లో వరంగల్ హజ్ కమిటీ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన యాత్రికులకు బుధవారం నిర్వహించిన మెడికల్ స్క్రీనింగ్ క్యాంపులో ఆయన మాట్లాడారు. ఇండియాలో కంటే సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, వాటిని తట్టుకునే విధంగా సౌదీ ప్రభుత్వం పలు సూచనలు చేసిందని, వాటిని పాటించాల్సి ఉందని చెప్పారు. వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఉచిత స్కీనింగ్ క్యాంపును యాత్రికులు సద్వినియోగం చేసుకుని, ఆరోగ్యకరంగా ఉండి హజ్‌యాత్రను పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హజ్ యాత్ర గైడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా హజ్ కమిటీ చైర్మన్ సర్వర్ మొహియొద్దీన్ ఘాజీ, కమిటీ సభ్యులు అఫ్జల్ మొహియొద్దీన్, అజీజ్, నజ్‌మొద్దీన్ గిలానీ, మహ్మద్ మాజిత్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.


