కొత్తగూడ: విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని పొగుళ్లపల్లి ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాల, మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, వంటగది, స్టాక్ రూంలను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో కట్టెల పొయ్యి ఎందుకు వాడుతున్నారని, ఎల్‌పీజీ ఎందుకు వాడడం లేదని హెచ్‌డబ్ల్యూఓను ప్రశ్నించారు. మెనూ ప్రకారం ఈరోజు చికెన్ పెట్టాల్సి ఉండగా.. కూరగాయలు ఎందుకు వండారని అడిగారు. హెచ్‌డబ్ల్యూఓ అనూష సమాధానం ఇస్తూ విద్యార్థుల కోరిక మేరకు గురువారం ఉగాది సందర్భంగా చికెన్ అందించేందుకు ఈరోజు కూరగాయల భోజనంపెట్టినట్లు తెలిపారు. తనకు నెల రోజుల క్రితం హాస్టల్ బాధ్యతలు ఇచ్చారని, గతంలో మాది రిగానే కట్టెల పొయ్యి వాడుతున్నట్లు చెప్పారు. ఏటా పాఠశాలకు రూ.35 లక్షల గ్రాంట్ వస్తుందని, ఎలా వినియోగిస్తున్నారో బిల్లులు చూపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్‌పీజీ వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయుల పనితీ రును సబ్జెక్టుల వారీగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ మున్వర్, ప్రిన్సిపాల్ గోవిందరావు, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్


