న్యూస్‌రీల్
సాక్షి, మహబూబాబాద్: తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగితే ఆర్థిక భారం తప్పడంతో పాటు.. అధునాతన వైద్యం, అందుబాటులో టీకాలు ఉంటాయని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే జిల్లాలో మాత్రం సాధారణ ప్రసవాలు పెంచడంలో ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు ఉందనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని చెప్పినా ప్రైవేట్ ఆస్పత్రుల ధోరణి మాత్రం మారడం లేదు. దీనికి తోడు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90శాతం సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి.
ప్రైవేట్‌కు వెళ్తే కోతలే..
పురిటి నొప్పులతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే 90శాతం గర్భిణులకు ఆపరేషన్ చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో అయితే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా.. ప్రసవ సమయం రాకముందే ఆపరేషన్ చేసి లక్షల రూపాయలు వసూళ్లు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గత ఏడాది జనవరి నుంచి గత నెల వరకు అంటే 14నెలల వ్యవధిలో జిల్లాలో మొత్తం 9,030 ప్రసవాలు జరిగాయి. ఇందులో 4,290 ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగాయి. ఇందులో 446 (10.40శాతం) మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. మిగిలిన 3,844 ప్రసవాలు అంటే 89.60శాతం ఆపరేషన్లు చేశారు.
ప్రభుత్వాస్పత్రుల్లో కాస్త మెరుగు...
ప్రైవేట్‌తో పోలిస్తే జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు, గార్ల, గూడూరు, తొర్రూరు, పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేస్తున్నారు. అయితే గతంలో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 14 నెలల్లో 4,740 ప్రసవాలు జరుగగా.. ఇందులో 1,836 ప్రసవాలు(38.73 శాతం) సాధారణం, 2,904ప్రసవాలు(61.26శాతం) సిజేరియన్ చేసినట్లు సమాచారం. అయితే ప్రభు త్వ ఆస్పత్రులకు వచ్చేవారిలో మొదటి కాన్పు అయి తే ప్రత్యేక వ్యాయామాలు, ఇతర పద్ధతుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మొదటి కాన్పు సిజేరియన్ జరిగి.. రెండో కాన్పు కోసం వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సిజేరియన్ చేయాల్సి వస్తుందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.
పర్యవేక్షణ లేక..
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లను తగ్గించేందుకు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భ్రూణ హత్యలు, అబార్షన్ల వల్ల జిల్లాలో సెక్స్‌రేషియో వెయ్యిమందికి 836కు పడిపోయిందని, దీనిపై ఆందోళనతో మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక బృందాలు పర్యటించి ఇక్కడి పరిస్థితిని గమనించాయి. వీటిని చక్కబెట్టాల్సిన అధికారులు.. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు హడావుడి చేయడం.. వైద్యారోగ్యశాఖలోని కొందరు అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మకై ్క మామూళ్లు తీసుకుంటూ.. పాపం పనిలో పాలుపంచుకుంటున్నారే విమర్శలు ఉన్నా యి. కాగా, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని, అలాగే వారిని ప్రోత్సహిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
గత ఏడాది నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రసవాల వివరాలు..
ఆస్పత్రులు సాధారణ సిజేరియన్ మొత్తం
ప్రభుత్వ 1,836 (38.73 శాతం) 2,904 (61.26 శాతం) 4,740
ప్రైవేట్ 446 (10.40 శాతం) 3,844 (89.60 శాతం) 4,290
మొత్తం 2,282 (25.30 శాతం) 6,748 (74.70 శాతం) 9,030


