మరిపెడ రూరల్: ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకై నా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు’ అని అందెశ్రీ రాసిన ఈ పాట ఇటీవల జరిగిన మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన గుర్తుచేస్తోంది. ఈ నెల 11న మహబాబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన బావబామ్మర్దులు బల్లెం ఉదయ్‌కిరణ్, బండి భిక్షం ద్విచక్రవాహనంపై బంధువుల ఇంటికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి తిరిగి స్వగ్రామం గాలివారిగూడేనికి 365వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి వారు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, ఇసుక కోసం రాత్రి వేళ ఓ ట్రాక్టర్ ట్రక్కు డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్తోంది. ట్రాక్టర్ లైట్లు కూడా డిమ్ముగా ఉండడంతో ద్విచక్రవాహనదారుడికి ట్రాక్టర్‌కు సంబంధించిన ఎలాంటి సిగ్నల్స్, లైటింగ్ కనిపించలేదు. దీంతో యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ట్రాక్టర్ ట్రక్కుకు వేలాడుతున్న డోర్‌కు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు ఆపి 108 వాహనానికి ఫోన్‌చేసి వారి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ, ఆ ట్రాక్టర్ డ్రైవర్ అలా చేయకుండా వారిని అక్కడే వదిలేసి, తనను ఎవరు చూడలేదని మానవత్వం మంటగలిసేలా సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని మరిపెడ సీఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ యువకుల మృతికి కారణమైన ట్రాక్టర్ మండలంలోని బాల్నిధర్మారం గ్రామానికి బాసిక లింగయ్యదిగా గుర్తించారు. ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పత్రాలు, అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుక, మట్టి, కలప అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మృతుల కుటుంబాలు కోరుతున్నాయి.
డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్లిన ట్రాక్టర్
వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టిన
యువకులు
పట్టించుకోకుండా వెళ్లిపోయిన
ట్రాక్టర్ డ్రైవర్
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
బాల్నిధర్మారం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌గా గుర్తించిన పోలీసులు


