● సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం
కురవి: సీరోలు మండలం కాంపల్లి శివారులో అచ్చమ్మ దాబా హోటల్ శనివారం అర్ధరాత్రి నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కాంపల్లి నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365/ఏ పక్కన సక్రంనాయక్ తండాకు చెందిన బానోత్ అచ్చమ్మ కొన్ని సంవత్సరాల నుంచి హోటల్ నడుపుకుంటూ జీవిస్తోంది. నాలుగు రోజులుగా హోటల్ బంద్ చేసి తన బిడ్డ డెలివరీ కోసం మహబూబాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. హోటల్ దగ్గర తన అమ్మానాన్నను కాపలా ఉంచింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్తున్న వాహనదారుడు చూసి అగ్నిమాపక శాఖ అధికారులకు అందించడంతో వారు సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్ పక్కనే పార్కింగ్ చేసి ఉన్న నాలుగు హార్వెస్టర్ (వరి కోత మిషన్స్) లకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో వృద్ధులు ఆరుబయట నిద్రిస్తుండడంతో ప్రమాదం తప్పింది.


