డిప్యుటేషన్లపై కసరత్తు? | - | Sakshi
Sakshi News home page

డిప్యుటేషన్లపై కసరత్తు?

Mar 16 2026 8:39 AM | Updated on Mar 16 2026 8:39 AM

అయోమయంలో పంచాయతీ

కార్యదర్శులు

పైసల పంచాయితీ వీడియో

వైరలవ్వడమే కారణమా..

ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిపై

వేటు వేయడం సరికాదని ఆవేదన

కొంత మినహాయింపు ఇవ్వాలని

కలెక్టర్‌కు వినతి

జిల్లాలో 406 మంది సిబ్బంది

నేడు విడుదల కానున్న జాబితా!

మహబూబాబాద్‌: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్‌ ప్రక్రియపై కలెక్టరేట్‌లో కసరత్తు మొదలైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది టీఎన్జీఓస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి డిప్యుటేషన్‌ విషయంలో కొంత మినహాయింపు ఇవ్వాలని, బదిలీ గైడ్స్‌లైన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కాగా, 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో తలెత్తిన సమస్యల వల్లే డిప్యుటేషన్‌ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిపైన వేటు వేయడం సరికాదని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

406మంది పంచాయతీ కార్యదర్ళులు..

జిల్లాలో 18మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా, 406మంది జూనియర్‌, సీనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. మిగితా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 179 జీపీ కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా, 307 జీపీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

15వ ఆర్థిక సంఘం నిధులు..

ఇటీవ కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈమేరకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ఈఎంఐ, కరెంట్‌ బిల్లులు, మల్టీ పర్సప్‌ వర్కర్ల వేతనాలు, పాత సర్పంచ్‌ల బిల్లులు తీసుకోవాల్సి ఉంది. కానీ, చాలామంది పంచాయతీ కార్యదర్శులు.. వారు చేసిన ఖర్చుల బిల్లులు తీసుకున్నారు. కొంత మంది సగం బిల్లులు తీసుకున్నారు.

పైసల పంచాయితీ కారణమా..

నిధులు విడుదలైన తర్వాత తలెత్తిన పైసల పంచాయితీనే పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్‌ ప్రక్రియకు అడుగులు పడినట్లు తెలుస్తోంది. గత కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌పై పంచాయతీ కార్యదర్శులను డిప్యుటేషన్‌పై బదిలీలు చేయాలని ఒత్తిడి వచ్చిందని, అయితే ఆయన బదిలీ చేయలేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. కాగా, ఈనెల 11న జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల వ్యవహారంపై మాట్లాడారు. జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శి నిధుల విడుదలపై వ్యవహరించిన తీరు పై వీడియో వైరల్‌ అయిందని, దానిని ప్రస్తుత కలెక్టర్‌ స్నేహ శబరీష్‌కు పంపినట్లు చెప్పారు. దీంతో కార్యదర్శుల డిప్యుటేషన్‌ అనివార్యమని అర్థమవుతోంది. మంత్రి ఆదేశాలతోనే డిప్యుటేషన్‌ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అందరిపై వేటా ?

జిల్లాలో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరికీ డిప్యుటేషన్లు వేయడం ఎంత వరకు సమంజసమని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఓ ప్రకారం ఐదేళ్లకు ఒకసారి బదిలీలు ఉంటాయని, బదిలీల గైడ్‌లైన్స్‌ కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. కాగా, ఈనెల 13న టీఎన్జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కార్యదర్శులు కలెక్టర్‌ను కలిసి విషయం వివరించారు. బదిలీల విషయంలో భార్యాభర్తలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు, గర్భిణులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కనీసం మండలాల వారీగా కాకుండా నియోజకవర్గం వారీగా బదిలీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా డీపీఓ కార్యాలయంలో మాత్రం కార్యదర్శుల డిప్యుటేషన్లు లేవని అది అంతా ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు.

నేడు విడుదల..

కార్యదర్శుల డిప్యుటేషన్‌ జాబితా గోప్యంగా త యారుచేస్తున్నారు. ఇటీవలజనగామ జిల్లాలో డిప్యుటేషన్‌ చేశారు. ఆతర్వాత మానుకోట జిల్లాలోనే డిప్యుటేషన్‌ చేస్తున్నారు. దాదాపు జాబితా పూర్తయిందని, ఈనెల 16న (సోమవారం) విడుదల కానున్నట్లు సమాచారం.

కలెక్టర్‌ను కలిశాం..

కార్యదర్శుల డిప్యుటేషన్‌ విషయంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాం. భార్యాభర్తలు, పిల్లల చదువులు, దివ్యాంగులు, గర్భిణులు ఉంటే వారి విషయంలో కొంత మినహాయింపు ఇవ్వాలి. దగ్గర మండలాల్లో కేటాయించాలని కోరాం. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు.

– వడ్డెబోయిన శ్రీనివాస్‌, టీఎన్జీఓస్‌ జిల్లా అద్యక్షుడు

డిప్యుటేషన్లు లేవు

పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్‌ ప్రక్రియ లేదు. అదంతా ప్రచారమే. కార్యాలయంలో అలాంటి ప్రక్రియ లేదు. ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేదు.

–హరిప్రసాద్‌, డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement