‘ముఖ’ చిత్ర కష్టాలు | - | Sakshi
Sakshi News home page

‘ముఖ’ చిత్ర కష్టాలు

Mar 16 2026 8:39 AM | Updated on Mar 16 2026 8:39 AM

వీబీ–జీరామ్‌జీలో ఫేషియల్‌ అటెండెన్స్‌

పలు సమస్యలతో రికార్డు కాని వైనం

తగ్గుతున్న కూలీల సంఖ్య

డోర్నకల్‌: వీబీ–జీరామ్‌జీ (ఉపాధి హామీ) పథకం అమలులో భాగాంగా పనుల వద్ద ఫేషియల్‌ అటెండెన్స్‌ పద్ధతి ప్రవేశ పెట్టారు. పనుల ప్రదేశంలో కూలీల ముఖాలను సెల్‌ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ ద్వారా ఫొటో తీసుకుని పనులు ప్రారంభించడం, పనులు పూర్తయిన తర్వాత మరోసారి ఫొటో తీసి ఆన్‌లైన్‌లో హాజరు రికార్డు చేస్తున్నారు. అయితే పలు సమస్యలతో రికార్డు కావడం లేదు. దీంతో కూలీలకు సమస్యలు తప్పడం లేదు.

అన్నీ సమస్యలే...

ఉపాధి కూలీల హాజరు నమోదులో వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ రోజు ఉదయమే మేట్‌ మస్టర్ల ద్వారా కూలీల వివరాలు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని కూలీలతో పని ప్రదేశానికి వెళ్తున్నారు. పని ప్రదేశం వద్ద మేట్‌ ప్రతీ కూలీ ముఖాన్ని ఫోటో తీసి కూలీల హాజరు నమోదు చేస్తున్నారు. అయితే సిగ్నల్‌ లేకపోవడం, ఎండ ఎక్కువగా ఉండడం, వృద్ధుల ముఖ కవలికలు సక్రమంగా ఉండకపోవడంతో కూలీల హాజరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్‌లో హాజరు నమోదు కాకపోవడంతో పని ప్రదేశం నుంచి కూలీలు వెనుదిరిగి పోతున్నారు. నాలుగు గంటల పని పూర్తయిన తర్వాత మస్టర్‌ ప్రకారం కూలీలను గ్రూప్‌ ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండగా నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. నాలుగు గంటల పని విధానం అమలులోకి రావడంతో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

మేట్‌కు పని భారం..

మేట్‌లు సొంతంగా 5జీ సెల్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ వినియోగిస్తూ కూలీల వివరాలను అప్‌లోడ్‌ చేయడం, పని ప్రారంభం, ముగింపు సమయంలో కూలీల ఫొటోలు తీయడం లాంటి విధులు నిర్వర్తిస్తున్నారు. మేట్‌లు కూడా కూలీలతో సమానంగా పనులు చేస్తున్నారు. వీరికి ఎలాంటి వేతనం అందకపోవడంతో మేట్‌ విధులు నిర్వర్తించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఐరిస్‌ ఫొటో క్యాప్చర్‌ అటెండెన్స్‌ విధానం ప్రారంభించి కొద్ది రోజులే అవుతున్నందున.. త్వరలో సమస్యలు పరిష్కారమవుతా యని అధికారులు చెబుతున్నారు. అయితే ఫొటో అటెండెన్స్‌ నమోదు కాక తాము పనులు కోల్పోతున్నామని, నాలుగు గంటల పని విధానాన్ని కూడా మార్చాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో 3,97,455 మంది కూలీలు..

జిల్లాలో పథకం ద్వారా 3,97,455 మంది కూలీలు లబ్ధి పొందుతున్నారు. 2,01,430 కుటుంబాలకు సంబంధించి 3,97,455మంది కూలీలు ఉన్నారు. అత్యధికంగా గూడూరు మండలంలో 35,695 మంది కూలీలు ఉండగా.. అత్యల్పంగా చిన్నగూడూరు మండలంలో 7,955 మంది ఉన్నారు.

భారంగా మారిన మేట్‌ విధులు

ఉపాధి కూలీగా పని చేస్తున్న నాకు మేట్‌ విధులు భారంగా మారుతున్నాయి. సొంత ఫోన్‌, నెట్‌తో కూలీల ఫొటోలు తీస్తున్నా. మేట్‌ విధులకు ఎలాంటి వేతనం చెల్లించడం లేదు. కూలీలతో సమానంగా పని చేస్తున్నాను.

– భాగ్యమ్మ, మేట్‌, గొల్లచర్ల

కొత్త పద్ధతితో ఇబ్బందులు..

ముఖాన్ని ఫొటో తీయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక్కోసారి ఫొటో తీయడం కుదరక పని లేకుండానే వెళ్లిపోతున్నాం. నాలుగు గంటల పని విధానాన్ని కూడా మార్చాలి.

–సీతమ్మ, ఉపాధి కూలీ, గొల్లచర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement