● రూ. 151లు చెల్లిస్తే ఆర్టీసీ కార్గో
ద్వారా బుకింగ్‌కు అవకాశం
నెహ్రూసెంటర్: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవాస్థానంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తలంబ్రాలను శుభకార్యాల్లో అక్షింతలుగా వాడితే సాక్షాత్త రాములోరి ఆశీస్సులు, అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. దీనిలో భాగంగా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భద్రాద్రి రాములోరి తలంబ్రాలను భక్తులకు అందిస్తారు. ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తుల ఇంటికి తలంబ్రాలు అందిస్తారు.
భక్తుల కోసం..
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా బుకింగ్ చేసుకుంటే తలంబ్రాలను సంస్థ ద్వారా పంపిణీ చేయనుంది. తలంబ్రాల కోసం రూ.151 చెల్లించి బుకింగ్ చేసి పేరు నమోదు చేసుకున్న భక్తులకు కార్గో సిబ్బంది స్వయంగా ఇంటికే తెచ్చి అందిస్తారు. ఈమేరకు ఆర్టీసీ ద్వారా చేపట్టే రాములోరి తలంబ్రాల సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
బుకింగ్స్..
రాములోరి తలంబ్రాల కోసం మహబూబాబాద్, తొర్రూరు ఆర్టీసీ డిపో కార్గో సెంటర్లలో లేదా ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. కాగా 93943 46777, 91542 98766 నంబర్లకు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చని అర్టీసీ అధికారులు తెలిపారు.
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా రూ.151 చెల్లించి పేరు నమోదు చేసుకుని తలంబ్రాలు పొందవచ్చు. ఈనెల 31వ తేదీ వరకు ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.
– వి.కల్యాణి, ఆర్టీసీ డీఎం, మహబూబాబాద్


