ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర చివరి ఆదివారం పెద్ద పట్నం, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నటరాజస్వామి మండపానికి ఎదురుగా ఉదయం 7 గంటల నుంచే 53 అడుగుల అతిపెద్ద పట్నం 11 రకాల రంగులతో సుమారు 50 మంది ఒగ్గు పూజారులు 6 గంటల పాటు శ్రమించి మహా పెద్దపట్నం వేశారు.
పెద్దపట్నంపైకి ఉత్సవ మూర్తులు..
పెద్దపట్నం వేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయ మూల మూర్తులైన అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జునుడి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాలను ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో మహా పెద్దపట్నంపైకి తీసుకొచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శైవాగమోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యా ణం నేత్ర పర్వంగా నిర్వహించారు. కొబ్బరికాయలు, మంగళ హారతులు స్వామివారికి సమర్పించి అక్షతలను పెద్దపట్నంపై చల్లారు. పూజలు పూర్తయిన వెంటనే శివసత్తులు, ఒగ్గు పూజారులు, భక్తులు తన్మయత్వంతో బండారి (పసుపు) చల్లుకుంటు మహా పెద్దపట్నంపై నృత్యాలు చేసి ఓలలాడారు.


