మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని మంగళికాలనీ, పత్తిపాక ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి అన్నారు. టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణ పరిధిలోని మంగళికాలనీ, పత్తిపాక, బాబునాయక్‌తండా, వినాయకతండా, సాంక్రియాతండా, పులిగోపాల్‌రెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి తాగుతున్న యువకులు మంగళికాలనీకి చెందిన తాళ్ల అభిషేక్, పత్తిపాకకు చెందిన నాయిని ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల విలువ చేసే 12 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తుకు బానిసై తమ జీవితాలు పాడుచేసుకోవద్దని సూచించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే పోలీసులకు వెంటనే సమాచారం తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. టౌన్ ఎస్సైలు అలీంహుస్సేన్, షాకీర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


