కేయూ మాజీ వీసీ లింగమూర్తి కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

కేయూ మాజీ వీసీ లింగమూర్తి కన్నుమూత

Mar 15 2026 1:27 AM | Updated on Mar 15 2026 1:27 AM

కేయూ క్యాంపస్‌: కేయూ మాజీ వీసీ, ఎకనామిక్స్‌ విభాగం విశ్రాంత ఆచార్యుడు, రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత ఎన్‌. లింగమూర్తి( 75) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండ బ్యాంకుకాలనీలోని తన నివాసంలో శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఐదుగురు కుమార్తెలు. కరీంనగర్‌ జిల్లా చౌటుప్పల్‌లో జన్మించిన లింగమూర్తి డిగ్రీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఎంఫిల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. కేయూలో ఎకనామిక్స్‌ విభాగంలో డాక్టరేట్‌ పొందిన లింగమూర్తి ఇదే యూనివర్సిటీలో అదే విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 35 సంవత్సరాల పాటు బోధన, పరిశోధనానుభవం కలిగిన లింగమూర్తి పర్యవేక్షణలో 12మంది పరిశోధకులు డాక్టరేట్లు, 23 మంది పరిశోధకులు ఎంఫిల్‌ పట్టాలు పొందారు. ఆయన 8 పుస్తకాలు రాశారు. 35 పబ్లికేషన్స్‌ ఉన్నాయి. నాలుగు రీసెర్చ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశారు.

2007 నుంచి 2010 వరకు కేయూ వీసీగా..

కాకతీయ యూనివర్సిటీలో 2007నుంచి 2010 వరకు వీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలోనే కేయూకు న్యాక్‌ ఏగ్రేడ్‌ లభించింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో కో–ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. లింగమూర్తి వీసీగా ఉన్న కాలంలోనే తెలంగాణ ఉద్యమం కేయూ కేంద్రంగా తీవ్రరూపం దాల్చింది. 2011లో ఉద్యోగ విరమణ పొందారు.

కేయూ వీసీ, రిజిస్ట్రార్‌ సంతాపం..

లింగమూర్తి మృతికి కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం సంతాపం తెలిపారు. కాగా, బ్యాంకు కాలనీలో లింగమూర్తి భౌతిక కాయాన్ని కేయూ మాజీ రిజిస్ట్రార్లు శంకరయ్య, పురుషోత్తం, మల్లారెడ్డి, కేయూ రిటైర్డ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సదానందం, జనరల్‌ సెక్రటరీ రవీందర్‌, శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ మహ్మద్‌ ఇక్బాల్‌ అలీ, కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ సందర్శించి నివాళులర్పించారు. లింగమూర్తి అంత్యక్రియలు హనుమకొండలోని పోచమ్మకుంటలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

విద్యావేత్తగా పరిశోధనల పరంగా సేవలు

ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ అధ్యాపక అవార్డు

నేడు అంత్యక్రియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement