● ములుగు ఎస్పీ, అటవీశాఖ అధికారుల హాజరు
ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు సమావేశం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌లో జరిగింది. దీనికి ములుగు జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌తోపాటు ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌భట్, ఛత్తీస్‌గఢ్‌లోని ఐజీ, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గినప్పటికీ సరిహద్దు విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ అటవీ ప్రాంతం, పోలీసులు సంరక్షణ చర్యలు, మావోయిస్టు కదలికలు, ప్రాజెక్టు రక్షణ విషయాలపై అక్కడి పోలీసులు, అటవీశాఖ అధికారులతో విపులంగా చర్చించారు. మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్, సహాయక చర్యలు, సానుభూతి పరుల కదలికల విషయాలను ఇరురాష్ట్రాల అధికారులు చర్చించుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగే అక్రమ కలప రవాణా, గంజాయి, స్మగ్లింగ్ వంటి విషయాలను చర్చించారు. కర్రెగుట్టలో ఏర్పాటు చేసి పోలీసులు క్యాంప్ భద్రత విషయాలను కూడా చర్చించారు. ఇంకా తెలంగాణకు చెందిన కొంతమంది మావోయిస్టు పార్టీలో ఉన్నారని, వారి కదలికలు తెలుసుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో పోలీసు భద్రత విషయాలను మరింత పటిష్టపర్చేందుకు వ్యూహరచన చేశారు. కేంద్ర బలగాల మోహరింపు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా, గతంలో పోలీస్‌స్టేషన్లలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) బెటాలియన్ ఉండేది. ఇప్పుడు కొన్ని మండలాల్లోని స్టేషన్లలో వాటిని ఎత్తివేశారు. తెలంగాణ పోలీసులను అదనంగా క్యాంప్‌లను పోలీస్‌స్టేషన్లలో చేయిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌ను వెనక్కి పంపించడంతోపాటు ఇక్కడ తీసుకోవాల్సిన భద్రత విషయాలను కూడా చర్చించారు.


