కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని ప్రభుత్వం
మహబూబాబాద్ రూరల్ : మొక్కజొన్న సాగు చేసిన రైతులు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి లా భాలు ఆర్జిస్తామని ఆశించిన రైతులు ధర పతనం కావడంతో అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో ఇదే అదునుగా భావించి ఓ పక్క తక్కువ ధరకు వ్యాపారులు ఖరీదు చేస్తుండగా.. మరోపక్క రైతులను దళారులు దోచుకుంటున్నారు.
తక్కువ ధరకు కొనుగోలు..
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అదేవిధంగా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని మక్కలను కొనుగోలు చేస్తున్న దళారులు కొన్ని ప్రాంతాల్లో డబ్బులు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామంటూ చెబుతున్నారు.
1,05,238 ఎకరాల్లో సాగు..
జిల్లాలో యాసంగిలో 1,05,238 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ప్రధానంగా కొత్తగూడ, గూడూరు, బయ్యారం, కేసముద్రం మండలాల్లో అధికంగా సాగు చేశారు. తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే ఆరుతడి పంట కావడంతో మొక్కజొన్న సాగుకే రైతులు మొగ్గు చూపారు. కాగా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురుచూడగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులు, ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
మార్క్‌ఫెడ్ లేక..
మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్రైవేట్ వ్యాపారులు క్వింటా మక్కలను రూ.1,700 నుంచి రూ.1,900 లోపు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర రావడం లేదని రైతులు వాపోయారు. గతంలో మక్కలు కొనుగోలు చేసిన కొంతమంది వ్యాపారులు డబ్బులు చెల్లించకుండా ఉడాయించారని, దీంతో చాలా మంది నష్టపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రైవేట్ వ్యాపారులకు మక్కలు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొంత మంది రైతులు మాత్రం ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
ప్రైవేటు వ్యాపారులను
ఆశ్రయిస్తున్న రైతులు
తక్కువ ధరకు అమ్మకాలు
నష్టపోతున్నామంటూ
అన్నదాతల ఆందోళన


