ఏజెన్సీ గ్రామాల వరకు వ్యాపిస్తున్న మంటలు
వేసవికాలం వచ్చిందంటే వన్య ప్రాణులు, అడవి పక్షులకు నీరు దొరకడమే కష్టం. దీనికి తోడు అడవులు కాలుతుండడంతో వాటివ గూడు చెదిరిపోతుంది. పక్షలు అడవిలో ఉండలేక వేడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. అలాగే అటవీ మంటల నుంచి తప్పించుకుని వన్య ప్రాణులు జనావాసాల్లోకి, పంట పొలాల వద్దకు వచ్చి వేటగాళ్ల ఉచ్చుల్లో పడుతున్నాయి. ఇదిలా ఉండగా మంటలు వ్యాప్తి వల్ల విలువైన ఆయుర్వేద మొక్కలు అంతరించిపోతున్నాయి.
కొత్తగూడ: జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలను కార్చిచ్చు వణికిస్తోంది. ఏజెన్సీ అనగానే పచ్చటి అడవి, చల్ల ని వాతావరణం, అందమైన గుట్టలు గుర్తుకు వస్తాయి. అయితే అదే అందం వేసవికాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలను వేడితో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వేసవిలో అడవి మొత్తం ఆకు రాల్చి మోడులా మారుతుంది. దీంతో ఎక్కడ చిన్న అగ్గి రవ్వ పడినా అది విస్తరించి అడవి మొత్తం దహనమవుతుంది. ఇటీవల అడవుల్లో కార్చిచ్చు చెలరేగి సమీప పల్లెల ప్రజల కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది.
మంటల వ్యాప్తి..
సూర్యుడి వేడికి తోడు మంటలు ఏర్పడడంతో ఇక్కడ మిగితా ప్రాంతాల కంటే అధిక వేడిని కలిగి ఉంటుంది. జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, వరంగల్ జిల్లాలోని ఖానాపురం, ములుగు జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వా యి, ఏటూరునాగారం, మల్లంపల్లి మండలాల్లో ఈపరిస్థితి ఉంటుంది. కొత్తగూడ మండలం బత్తులపల్లి గ్రామంలో మంటలు పాఠశాల వరకు సమీపించడంతో విద్యార్థులు అరుపులు పెడుతూ పరుగులు తీశారు. గంగారం మండలం మర్రిగూడెం, పెద్దఎల్లాపూర్ గ్రామాల్లో కార్చిచ్చు కారణంగా మక్కజొన్న కుప్పలు కాలిపోయాయి. ప్రతీ సంవత్సరం గడ్డి వాములు, పూరిల్లు, పంట పొలాలు తగలబడున్నాయి. అయితే మంటలార్పడానికి నర్సంపేట లేదా మహబూబాబాద్ నుంచి ఫైరింజన్ రావాలి. అక్కడినుంచి వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరుగుతోంది.
మంటలు ఆర్పడంలో
ఫారెస్ట్ సిబ్బంది విఫలం..
అడవుల్లో మంటలు ఆర్పడంలో అటవీశాఖ సిబ్బంది విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మంటలార్పేందుకు అధునాతన మిష న్లు, నిధులు సమకూర్చినా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభత్వు లక్ష్యం నీరుగారుతోంది. అడవుల్లో మంటలు విస్తరించకుండా వేసవికి ముందే కాలి బా టలు వేయాల్సి ఉంటుంది. అడవిలో మంటలకు తునికాకు కాంట్రాక్టర్‌లే కారణం అనే ఆరోపణలు ఉన్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదనే తెలు స్తోంది. తునికాకు మోడెం కొట్టకుండా అడవులకు నిప్పు పెడుతున్నారని స్థానికులు అంటున్నా రు.
అటవీ దహనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మంటలు విస్తరించకుండా సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాం. పశువుల కాపర్లు, మోడెం కొట్టే కూలీలు అటవీ దహనాలకు కారకులుగా భావించి వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. వన్యప్రాణులు వేటకు గురికాకుండా సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు చేయిస్తున్నాం.
– చంద్ర శేఖర్, సబ్ డీఎఫ్‌ఓ
వన్యప్రాణుల విలవిల
పంట పొలాలు సైతం దగ్ధం
ఆందోళనలో అటవీ సమీప
పల్లెల ప్రజలు


